తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ విద్యా వారోత్సవాల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్ముతూ, ఈ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రూ.1,100 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖకు కేటాయించే నిధులను 15 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం ఉన్న ఫిన్లాండ్‌కు ఇప్పటికే 25 మంది టీచర్లను అధ్యయనం కోసం పంపించామని, అవసరమైతే మరిన్ని దేశాలకు పంపిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
'విద్యావ్యవస్థలో తెలంగాణ ప్రాంతం దశాబ్దాలుగా వివక్షకు గురైనది. వివక్షతో 1969లో తెలంగాణ ఉద్యమం మెుదలైంది. అప్పటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురైతే మన విద్యా వ్యవస్థ ప్రమాణాలు పడిపోతాయని గ్రహించాం. పేద బడుగు బలహీన వర్గాలకు సైతం నాణ్యమైన విద్యను అందించడం మా ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కూడా అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతోంది. కులాల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండటం వల్ల వివక్ష పెరుగుతోందని భావించి, అందరూ కలిసి చదువుకునేలా అత్యాధునిక 'ఇంటిగ్రేటెడ్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వర్సిటీలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, తమ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు. వివాదాలు లేకుండా 36 వేల మంది టీచర్ల బదిలీలను పూర్తి చేశామన్నారు.
{{/usCountry}}గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వర్సిటీలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, తమ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు. వివాదాలు లేకుండా 36 వేల మంది టీచర్ల బదిలీలను పూర్తి చేశామన్నారు.
{{/usCountry}}'ప్రభుత్వ బడుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి 17:1 గా ఉన్నప్పటికీ, ఫలితాల్లో ప్రైవేటు కంటే ఎందుకు వెనుకబడి ఉన్నామో ఆలోచించాలి. పాతకాలపు సిలబస్‌ను మార్చి, టెన్ ప్లస్ టూ విధానం అమల్లోకి తెచ్చి డ్రాపౌట్లను అరికడతాం.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ భవిష్యత్తు తరాలను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కేవలం భవనాలుగా కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించే వేదికలుగా మారాలని సీఎం పిలుపునిచ్చారు.