...
...
Next Story

కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే అవకాశం లేదు : మంత్రి తుమ్మల

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద మాత్రమే నీటి నిల్వకు అవకాశం ఉందన్నారు.

Published on: Nov 15, 2026, 16:38:03 IST
Advertisement

గోదావరి నదిలో నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో రానున్న వేసవి కాలంలో ఉమ్మడి ఖమ్మం సహా పరివాహక జిల్లాలకు తాగునీటి గండం తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గేట్ల నిర్వహణకు సాంకేతిక, అనుమతుల పరమైన అడ్డంకులు ఉన్నందున అక్కడ నీటిని నిల్వ చేసే అవకాశం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా దుమ్ముగూడెం ఆనకట్ట, సమ్మక్క సాగర్ బ్యారేజీల ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను మంత్రి తుమ్మల క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఉన్నతాధికారులతో కలిసి ఆనకట్టపై ఇసుక బస్తాలతో చేపడుతున్న నీటి నిల్వ పనులను పరిశీలించారు. సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల వరకు గోదావరిలో ఉండే ఇన్‌ఫ్లోలు ఈ ఏడాది ఎల్‌నినో విపత్తు కారణంగా ముందే తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. అశ్వాపురం నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా మూడు జిల్లాలకు తాగునీటి సరఫరా నిరాటంకంగా సాగేందుకు దుమ్ముగూడెం వద్ద నీటిని నిల్వ చేయడం అత్యవసరమని ఆయన వివరించారు.

ఆనకట్ట ఎత్తు పెంచేందుకు ఇప్పటికే మూడు లేయర్ల ఇసుక బస్తాలను ఇరిగేషన్ సిబ్బంది విజయవంతంగా ఏర్పాటు చేశారు. మరో రెండు నుంచి మూడు లేయర్లను త్వరలోనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏర్పాట్ల ద్వారా సుమారు 1.2 మీటర్లకు పైగా నీటిమట్టం (దాదాపు ఒక టీఎంసీ మేర నీరు) నిల్వ ఉంటుందని, తద్వారా రాబోయే మూడు నుంచి నాలుగు నెలల పాటు తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఇసుక బస్తాల నుంచి నీరు వృథా కాకుండా ప్రత్యేక రక్షణ షీట్లు వేయాలని మంత్రి తుమ్మల సూచించారు.

ప్రస్తుతం నీటి నిల్వకు సమ్మక్క సాగర్ బ్యారేజీ మాత్రమే అనుకూలంగా ఉందని, ఇక్కడ అదనంగా 3 నుంచి 4 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు పొరుగు రాష్ట్రాలతో చర్చించి అనుమతులు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.

పర్యటనలో భాగంగా దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని పూసుకుంట గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్హులైన గిరిజనులకు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉపాధి హామీ జాబ్ కార్డులతో పాటు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ప్రకృతి విపత్తుల వేళ అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks