IPL Ticket Scam : వీఐపీల లెటర్ హెడ్లు ఫోర్జరీ - ఐపీఎల్ టికెట్ల దందా గుట్టురట్టు..! వెలుగులోకి విస్తుపోయే నిజాలు

IPL Ticket Scam Hyderabad : హైదరాబాద్‌లో వీవీఐపీల పేరిట నకిలీ లెటర్ హెడ్లు సృష్టించి, ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు పొందుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 22 వేల విలువైన టికెట్లు, ఫోర్జరీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Published on: May 5, 2026, 09:26:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ (IPL) సందడిని ఆసరాగా చేసుకుని అక్రమంగా కోట్లు సంపాదించాలని చూసిన ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సామాన్య ప్రజలకు టికెట్లు దొరకడమే కష్టంగా మారిన తరుణంలో…. ఈ ముఠా ఏకంగా న్యాయమూర్తులు, మంత్రులు, గవర్నర్ల పేరిట ఫోర్జరీ లెటర్ హెడ్లను సృష్టించి ఖరీదైన టికెట్లను దక్కించుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

టికెట్ల దందా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్
టికెట్ల దందా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్

ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సమయంలో స్టేడియం పార్కింగ్ ఏరియాలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ, భారీ ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. తక్షణమే రంగంలోకి దిగిన బందోబస్తు బృందం వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా…. ఒక్కొక్కటి రూ. 22,000 విలువ చేసే ఐదు కాంప్లిమెంటరీ టికెట్లు లభ్యమయ్యాయి.

విస్తుపోయే నిజాలు….

పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన విషయాలు విస్మయానికి గురిచేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ముగ్గురు నిందితులు, తమిళనాడుకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్న నిందితులతో కలిసి ఈ భారీ స్కామ్‌కు తెరలేపారు.

ఇంటర్నెట్ నుంచి వివిధ రాష్ట్రాల మంత్రులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జీల అధికారిక లెటర్ హెడ్లను డౌన్‌లోడ్ చేశారు. ఆ లెటర్ హెడ్లపై వారి సంతకాలను ఫోర్జరీ చేసి, వీవీఐపీ కోటాలో టికెట్లు కావాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)తో పాటు ఇతర రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు విన్నవించారు. ఈ నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మిన అసోసియేషన్లు వారికి అత్యంత ఖరీదైన గ్యాలరీలకు సంబంధించిన కాంప్లిమెంటరీ టికెట్లను జారీ చేశాయి. అలా ఉచితంగా లేదా నామమాత్రపు ధరతో పొందిన టికెట్లను బయట బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నిందితుల నుంచి ఉప్పల్ పోలీసులు ఒక కారు, ఐదు ఐపీఎల్ టికెట్లు (మొత్తం విలువ రూ. 1.10 లక్షలు), ఐదు మొబైల్ ఫోన్లు, ఐదు ఫోర్జరీ చేసిన వీవీఐపీ లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

క్రికెట్ అసోసియేషన్లు కూడా ఇలాంటి లెటర్ హెడ్లు వచ్చినప్పుడు వాటి ప్రామాణికతను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని… లేకపోతే ఇలాంటి మోసగాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాటిపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More