తెలంగాణ ఉద్యమంలోని జర్నలిస్టులను గుర్తించి ఆదుకోండి - కోదండరాంకు TJF వినతి
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కమిటీ కో చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) ప్రతినిధులు కలిశారు. ఉద్యమకారులు, జర్నలిస్టుల గుర్తింపు, సంక్షేమంపై సమగ్ర వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) కోరింది. ఇందులో భాగంగా టీజేఎఫ్ ప్రతినిధులు… ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ కో చైర్మన్, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) ప్రొఫెసర్ కోదండరాంను సోమవారం కలిశారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ నేతృత్వంలోని కమిటీ కార్యవర్గ సభ్యులు ఈ భేటీలో పాల్గొని…. జర్నలిస్టుల, ఉద్యమకారుల సమస్యలపై సమగ్ర ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని కోదండరాంకు అందజేశారు. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నాటి క్షేత్రస్థాయి పరిస్థితులను ఫోరం ప్రతినిధులు కో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. స్వరాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జర్నలిస్టులు, ఉద్యమకారులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. నాడు వారు పోషించిన అద్భుతమైన పాత్రను, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పరంగా వారికి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాల ఆవశ్యకతను కోదండరాంకు వివరించారు.
సంక్షేమ పథకాలు, కుటుంబ భద్రతకు విజ్ఞప్తి
స్వరాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని, జర్నలిస్టును ప్రభుత్వ పరంగా తగిన రీతిలో గుర్తించాల్సిన బాధ్యత ఉందని ఫోరం ప్రతినిధులు స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని… అలాగే వారి కుటుంబాలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేలా కమిటీ ద్వారా ప్రభుత్వానికి బలమైన సిఫార్సులు చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఆరోగ్య భద్రత, ఇతర పెండింగ్ సమస్యలపై ప్రొఫెసర్ కోదండరాంతో ఫోరం ప్రతినిధులు కూలంకషంగా చర్చించారు.
టీజేఎఫ్ ప్రతినిధులు అందజేసిన లేఖలోని అంశాలను పరిశీలించిన కోదండరామ్… పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఈనెల 21న జర్నలిస్టులతో ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి కమిటీ తరపున సిఫార్సులు అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, ఫోరం కార్యదర్శులు ముద్ధం స్వామి, పాలకూరి రాజు, మనం శ్రీనివాస్, పోగుల ప్రకాష్, ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి తదితరులు పాల్గొని తమ డిమాండ్లను కో చైర్మన్ ముందుంచారు.
TJF ముఖ్యమైన ప్రతిపాదనలు:
- స్వరాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో తమ జీవితాలను, భవిష్యత్తును త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. కాబట్టి ఉద్యమంలో పాల్గొన్న వారందరి వివరాలను పారదర్శకంగా సేకరించాలి. డేటా సేకరించటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర డిజిటల్ డేటాబేస్ రూపొందించాలి. ఆన్ లైన్ లో ఈ వివరాలను అందుబాటులో ఉంచాలి.
- అర్హులైన వారందరికీ అధికారికంగా "తెలంగాణ రాష్ట్ర పోరాట యోధులు" అనే పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయాలి. ఈ కార్డులను దుర్వినియోగపర్చే అవకాశం లేకుండా పక్కాగా…. పకడ్బందీగా క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక సాంకేతికతతో రూపకల్పన చేయాలి.
- కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ..... ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇళ్ల స్థలంతో పాటు, గృహనిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలి. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలను ప్రకటించి... స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేయాలి.
- ఉద్యమ సమయంలో అరెస్టై జైలు శిక్ష అనుభవించినవారు, కఠినమైన కేసులు ఎదుర్కొన్నవారు, పోలీస్ స్టేషన్లలో బైండోవర్ అయిన వారిని ఒక ప్రత్యేక కేటగిరీగా గుర్తించి వారికి అదనపు సంక్షేమ ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకా ఎదుర్కొంటున్న కేసులను తక్షణమే బేషరతుగా ఉపసంహరించాలి.
- మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రధాన గుండెకాయగా, పోరాటాల కేంద్రంగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) క్యాంపస్‌లో విద్యార్థి అమరవీరుల స్మారకార్థం ఒక భారీ స్తూపాన్ని నిర్మించాలి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వరాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న విద్యార్థి వీరుల త్యాగాలను స్మరించుకుంటూ.... విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాల విద్యార్థులకు అది ఒక గొప్ప స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుంది.
- ఉద్యమకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూసేందుకు ప్రత్యేకంగా ఒక శాశ్వత "తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు"ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి.
- ఉద్యమకారుల కుటుంబాల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని అందరికీ ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా లేదా భారీ రాయితీతో అందించేలా పాలసీని రూపొందించాలి.
- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాలలో (ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు మొదలైనవి) ఉద్యమకారుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. షరతులు లేకుండా ప్రత్యేక కేటగిరిగా గుర్తించే దిశగా నిర్ణయం తీసుకోవాలి.
- తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న ఆవేదన, అన్యాయాలు, ఎందరో వీరుల బలిదానాలు మరియు సుదీర్ఘ పోరాటాల చరిత్రను రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం.... 1969 తొలిదశ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు సాగిన తెలంగాణ ఉద్యమ సమగ్ర చరిత్రను పాఠ్యపుస్తకాలలో ఒక ముఖ్యమైన బోధనాంశంగా చేర్చాలి. దీనివల్ల విద్యార్థుల్లో చిన్నతనం నుంచే మన ప్రాంత అస్తిత్వంపై అవగాహన, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులపట్ల గౌరవం పెంపొదుతుంది.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. ఉద్యమ కాలంలో చిన్న, పెద్ద పత్రికలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో పనిచేస్తూ ఉద్యమాన్ని భుజాన వేసుకున్న వందలాది మంది జర్నలిస్టులు నేడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డులతో ఎలాంటి సంబంధం లేకుండా.. నాడు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేలా ప్రత్యేక హెల్త్ కార్డులను జారీ చేయాలి. ప్రభుత్వ పరిధిలోని అన్ని రకాల సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలి.
- ఉద్యమ కాలం నుంచి నేటి వరకు నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్ట్ సంఘాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాటి పోరాటాల్లో భాగస్వాములైన జర్నలిస్ట్ సంఘాల భవన నిర్మాణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను కేటాయించాలి. అంతేకాకుండా... మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు సరికొత్త సాంకేతికతను అందుకోవడానికి వీలుగా.... ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్ని వసతులతో కూడిన అత్యాధునిక మీడియా సెంటర్లు, డిజిటల్ స్టూడియోలను నిర్మించి ఇవ్వాలి.
- 1969 తొలిదశ ఉద్యమం నుంచి మొన్నటి మలిదశ పోరాటం వరకు ప్రాణాలర్పించిన అమరవీరుల, అలాగే ఉద్యమాన్ని ముందుండి నడిపిన ప్రముఖ ఉద్యమకారుల జీవిత చరిత్రలు, వారు చేసిన పోరాటాలు కాలగర్భంలో కలిసిపోకుండా చూడాలి. అందుకోసం వారందరి వివరాలు, నాటి నినాదాలు, చారిత్రాత్మక పత్రాలు, ఛాయాచిత్రాలతో కూడిన ఒక అత్యాధునిక సమగ్ర డిజిటల్ ఆర్కైవ్‌ను (Digital Archive) ప్రభుత్వం అధికారికంగా రూపొందించాలి.
- ఉద్యమ చరిత్రను శాశ్వతంగా, భౌతికంగా భద్రపరిచేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఒక అత్యాధునిక "తెలంగాణ ఉద్యమ స్మృతి భవన్" లేదా "తెలంగాణ ఉద్యమ మ్యూజియం" ఏర్పాటు చేయాలి.
- ఉద్యమకారుల రోజువారీ ప్రయాణ అవసరాలను, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సుల్లో ఉచిత లేదా రాయితీతో కూడిన బస్సు పాస్‌లను జారీ చేయాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


