...
...
Next Story

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? లేదా? దర్యాప్తు చేయాలని కవిత డిమాండ్

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించి కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లీంపు కోసం కెనాల్ ఉందా? లేదా? అనే విషయాన్ని దర్యాప్తు చేయాలన్నారు.

Published on: Nov 13, 2026, 14:39:13 IST
Advertisement

తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్దిపేట జిల్లాలో పర్యటించడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భర్తతో కలిసి సిద్దిపేటలో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయానికి కవిత భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

సిద్దిపేటలో టీఆర్ఎస్ కార్యాలయానికి భూమిపూజ
సిద్దిపేటలో టీఆర్ఎస్ కార్యాలయానికి భూమిపూజ

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌కు అక్రమంగా నీటిని మళ్లించారన్న ఆరోపణలపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. అసలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాలువ సదుపాయం ఉందా? లేదా? అనే విషయంపై బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని నిలదీశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన కవిత, తప్పులను ప్రశ్నిస్తే తనపై ఎదురుదాడి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ఆస్తుల విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే నిరూపించాలన్నారు కవిత. ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఆస్తి ఉన్నట్లు తేలినా దాన్ని ప్రజలకే రాసిస్తానని బహిరంగ సవాల్ విసిరారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీరుపై కవిత నిప్పులు చెరిగారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఐదు ఎకరాల విలువైన భూమిని హరీశ్ రావు, ఆయన అనుచరులు కబ్జా చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట గడ్డపైనే హరీశ్ రావును ఓడించి తీరుతామని, ఆయనను ప్రజా జీవితం నుంచే తరిమివేస్తామని కవిత శపథం చేశారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని కవిత విమర్శించారు. ముఖ్యంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం సర్వస్వం కోల్పోయిన భూ నిర్వాసితులకు నేటికీ సరైన పరిహారం అందకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సిద్దిపేట ప్రజలు ఒకే కుటుంబం, కొద్దిమంది నేతల గుప్పిట్లో నలిగిపోతున్నారని, ఇప్పుడు సిద్దిపేట ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు ముందుగా ఆత్మపరిశీలన చేసుకుని, ఆ తర్వాతే తన గురించి మాట్లాడాలని కవిత హితవు పలికారు.

సిద్దిపేట జిల్లా తన సొంత జిల్లా అని పేర్కొన్న కవిత, రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన జెండాను ఎగరవేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య, మెరుగైన వైద్యం అందాలన్నదే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు.

ఎన్నో ఏళ్లుగా కేసీఆర్, హరీశ్ రావులకు ప్రజలు అవకాశాలు ఇచ్చారని, ఇకనైనా ప్రజలు ఆలోచించి అవినీతిపరులను పక్కన పెట్టాలని కవిత కోరారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకుందామని, నిజాయితీ కలిగిన కొత్తవారికి అవకాశం ఇచ్చి తమ పార్టీని ఆదరించాలని సిద్దిపేట ప్రజలకు కవిత పిలుపునిచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks