సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నెల తిరగక ముందే ప్రియుడితో రేణుక పెళ్లి!

Software seetharam Suicide Case : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. భర్త చనిపోయి నెలరోజులు తిరగకముందే తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నది.

Published on: May 2, 2026, 10:48:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం మృతి కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొలుత మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత కారణాలతో సీతారాం బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావించినప్పటికీ, పోలీసుల విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ విషాద ఘటనలో ఆయన భార్య రేణుక ప్రవర్తన ఇప్పుడు కేసును కీలక మలుపు తిప్పింది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం కేసు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం కేసు

సీతారాం మరణించిన కేవలం నెల రోజులు కూడా గడవక ముందే, రేణుక తన ప్రియుడు రమణారెడ్డిని రహస్యంగా వివాహం చేసుకోవడం సంచలనం సృష్టించింది. భర్త మరణిస్తే పుట్టెడు దుఃఖంలో ఉండాల్సిన భార్య.. అంత తక్కువ సమయంలోనే మరో వ్యక్తితో ఏడడుగులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె భార్యేనా.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

సీతారాం బతికున్నప్పుడే రేణుకకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీతారాం ఆత్మహత్య వెనుక రేణుక, ఆమె ప్రియుడి ప్రోద్బలం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రేణుక కాల్ డేటా, సోషల్ మీడియా చాటింగ్స్ పరిశీలించగా, గత కొంతకాలంగా ఆమె సదరు వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది. సీతారాం మరణంపై మొదటి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన తల్లిదండ్రులు. ఇప్పుడు రేణుక పెళ్లి వార్తతో ఆందోళనకు దిగారు. తమ కొడుకును పథకం ప్రకారమే వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం రేణుకతోపాటుగా ఆమె వివాహం చేసుకున్న రమణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. భర్త చనిపోయిన వెంటనే పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? సీతారాం మరణానికి, వీరి వివాహానికి మధ్య ఉన్న లింకు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రాణాలు కోల్పోతే, కనీసం నెల రోజులు కాకముందే.. మరో పెళ్లి చేసుకోవడం చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికే అనిపిస్తోందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు లభిస్తే.. క్లారిటీ రానుంది. మరోవైపు సీతారాం తండ్రి పలు మీడియా ఛానల్లోకి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఘోరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో ఈ విషయాల మీద స్పష్టత వస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More