Telangana Crime News : టెక్నీషియన్లుగా అవతారం...ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల చోరీ - దొంగల ముఠా గుట్టురట్టు!
ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నాలుగు వెంటిలేటర్లు దొంగిలించిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితుడితో పాటు హైదరాబాద్‌కి చెందిన స్క్రాప్ డీలర్‌ను అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఖరీదైన వైద్య పరికరాలను దొంగిలిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు చేధించారు. జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగం నుంచి నాలుగు వెంటిలేటర్లను చోరీ చేసిన ఘరానా దొంగలను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అఖిల్ మహాజన్ శనివారం వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 30వ తేదీన మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతానికి చెందిన సజ్జన్ వసంత్ ఎమ్, అభిజిత్ అనే ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్ల అవతారమెత్తారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించిన వీరు, నేరుగా రెండో అంతస్తులోని వార్డులకు వెళ్లారు. అక్కడ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర చికిత్స అందిస్తున్న విభాగం నుంచి ఏకంగా నాలుగు వెంటిలేటర్లను చాకచక్యంగా దొంగిలించి, మహారాష్ట్రకు తరలించారు.
హైదరాబాద్ డీలర్‌తో కుమ్మక్కు..
దొంగిలించిన ఈ ఖరీదైన వైద్య పరికరాలను నగదుగా మార్చుకునేందుకు నిందితులు హైదరాబాద్‌కి చెందిన మెడికల్ ఈక్విప్మెంట్ సేల్స్ అండ్ సర్వీస్ డీలర్ కొండా రెడ్డిని సంప్రదించారు. అవి ఆసుపత్రి నుంచి దొంగిలించిన పరికరాలని స్పష్టంగా తెలిసినప్పటికీ….. కొండా రెడ్డి వాటిని కొనుగోలు చేయడానికి అంగీకరించాడు. ఈ క్రమంలోనే ఒప్పందం కుదుర్చుకుని పరికరాలను తీసుకోవడానికి కొండా రెడ్డి స్వయంగా చంద్రపూర్ వెళ్లాడు.
తనిఖీల్లో దొరికిపోయిన దొంగలు..
మహారాష్ట్ర నుంచి కారులో ఈ వెంటిలేటర్లను హైదరాబాద్ తరలిస్తుండగా, ఆదిలాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తించిన నిందితులు, అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని వెంటాడి అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టేషన్లో నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. గతంలో కూడా మహారాష్ట్రలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా తాము ఇటువంటి చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అక్కడ దొంగిలించిన వైద్య పరికరాలను కూడా హైదరాబాద్‌లోని కొండా రెడ్డికే విక్రయించినట్లు విచారణలో వెల్లడించారు.
ఈ కేసులో సజ్జన్ వసంత్, కొండా రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు అభిజిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి రిమ్స్ ఆసుపత్రికి చెందిన 4 వెంటిలేటర్లు, నిజామాబాద్ ఆసుపత్రి నుంచి దొంగిలించిన 1 వెంటిలేటర్, 1 ఎన్ఎస్టి (NST) మిషన్, అలాగే మహారాష్ట్ర ఆసుపత్రుల నుంచి చోరీ చేసిన 1 ఫీటల్ మానిటర్, 1 డయాథెర్మీ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 1 లక్ష నగదు, ఒక బైక్, ఒక కారును జప్తు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

