BRAOU New Courses : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్తగా 5 కోర్సులు - యూజీసీ అనుమతి
BRAOU New Courses : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. యూజీసీ అనుమతి లభించింది.
BRAOU New Courses : దూర విద్యలో చదువుకోవాలనుకునే వారికి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) మరో తీపి కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను చేరువ చేసేలా ఐదు కీలక కోర్సుల నిర్వహణకు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్, అకాడమిక్ రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని వర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఓ ప్రకటనలో వెల్లడించారు.

యూజీసీ ఆమోదం తెలిపిన కోర్సులు:
- ఎమ్.ఏ. ఎడ్యుకేషన్ (M.A. Education).
- ఎమ్.ఏ. ఎడ్యుకేషన్ - స్కూల్ అడ్మినిస్ట్రేషన్ (M.A. Education - School Administration).
- మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW).
- ఎమ్.ఎస్సీ. జాగ్రఫీ (M.Sc. Geography).
- బి.ఈడీ. స్పెషల్ ఎడ్యుకేషన్ (B.Ed. Special Education) – (ఈ కోర్సు అనుమతిని పునరుద్ధరించారు).
ఈ ఏడాది జూన్ నెలలో యూజీసీ నిపుణుల కమిటీ వర్చువల్ పద్ధతిలో విశ్వవిద్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. వర్సిటీలో ఉన్న అత్యాధునిక మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది నైపుణ్యాలు, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఈ ప్రోగ్రామ్స్‌కు తుది ఆమోదం తెలిపింది.
ఈ కొత్త కోర్సుల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా చొరవతోనే ఇవి సాధ్యమయ్యాయని వైస్-ఛాన్సలర్ కొనియాడారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లర్నింగ్ (ODL) విధానం ద్వారా ప్రత్యేక వృత్తిపరమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో వీటిని రూపొందించారు.
ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ ట్రైనింగ్
పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఎమ్.ఏ. (ఎడ్యుకేషన్), ఎమ్.ఏ. (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ఉద్దేశించిన బి.ఈడీ. కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి.
"ఈ కోర్సులు ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచడమే కాకుండా, వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడతాయి. త్వరలోనే తెలంగాణ విద్యాశాఖతో దీనిపై ప్రత్యేక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోబోతున్నాం," అని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు.
మరోవైపు…. సామాజిక సేవా రంగంలో స్థిరపడాలనుకునే వారికి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW), పర్యావరణ-భౌగోళిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి జాగ్రఫీ పీజీ కోర్సులు కెరీర్ పరంగా ఎన్నో కొత్త అవకాశాలను సృష్టిస్తాయి.
త్వరలోనే అడ్మిషన్ల నోటిఫికేషన్
యూజీసీ కొత్తగా ఆమోదించిన ఈ ఐదు కోర్సులకు సంబంధించిన కనీస అర్హతలు, ప్రవేశాల విధానం, ఫీజుల వివరాలు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్ల సమాచారంతో కూడిన సమగ్ర అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విశ్వవిద్యాలయం త్వరలోనే అధికారికంగా విడుదల చేయనుంది.
విద్యార్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లు www.braou.ac.in లేదా www.braouonline.in సందర్శించవచ్చు. మరింత సమాచారం కోసం హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680333 లేదా 040-23680555 ద్వారా సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

