హైదరాబాద్ నగరవాసులకు జలమండలి మరోసారి అలర్ట్ ఇచ్చింది. నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ లోని పంప్ హౌస్ లో 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించనున్నారు. వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇక పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మిమీ డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను మార్పు చేస్తారు. సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మిమీ డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను మార్పు చేయటంతో పాటు పలు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
మార్చి 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు(36 గంటలు) ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
- ఓ అండ్ ఏం డివిజన్ నెం.3: షేక్‌పేట్ రిజర్వాయర్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుంది. భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా ఉంటుంది.
- ఓ అండ్ ఏం డివిజన్ నెం.18: మణికొండ, కోకాపేట్, నర్సింగి, మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు.
- ట్రాన్స్‌మిషన్ I & II: నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుంది.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ముందస్తు ప్రకటన నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.