ఏపీలో 12 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లు.. 2028నాటికి కాలేయ మార్పిడి!

ఆంధ్రప్రదేశ్‌లో 12 అవయవ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే 2028 నాటికి కాలేయ మార్పిడి, 2030 నాటికి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు నగరాల్లో గుండె మార్పిడి చికిత్సలను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Published on: Aug 3, 2026, 14:05:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో అవయవ మార్పిడి చికిత్సలను పేదలకు ఉచితంగా, మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దశలవారీగా 12 ప్రభుత్వ ఆసుపత్రులను అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘జీవన్‌దాన్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అవయవ దాన దినోత్సవ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద రోగులు ఖరీదైన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బోధనాసుపత్రుల్లోనే అధునాతన అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అవయవ దానాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. మొదటి విడతలో భాగంగా విశాఖపట్నం, పలాస, కర్నూలు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ బోధనాసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల సేవలను విస్తరించనున్నారు.

2028 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాలేయ మార్పిడి చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2030 నాటికి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలో అవయవ మార్పిడి చికిత్సల అవసరం ఏటా పెరుగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 31 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మాత్రమే జరిగాయని, డిమాండ్‌కు తగినంతగా అవయవాలు లభించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 5,935 మంది రోగులు వివిధ అవయవాల కోసం నిరీక్షణ జాబితాలో ఉన్నారని తెలిపారు.

ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కుటుంబాలను అవయవ దానానికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మరణానంతర అవయవ దాతల కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10,000 ఆర్థిక సాయాన్ని రూ.1 లక్షకు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోంది.

సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గాన్ డోనార్స్ అసోసియేషన్ ప్రతినిధులు దాతల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అవయవ దానం చేసిన ప్రతి కుటుంబంలో ఒక అర్హులైన వ్యక్తికి కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనను త్వరలోనే పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో అవయవ, శరీర దానంపై అవగాహన కల్పించే అంశాలను చేర్చాలని ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా, మెరుగైన రీతిలో సంక్లిష్టమైన అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More