ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఖాతాలోకి పలు స్థానాలు వెళ్లాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు బరిలో నిలవకపోవడంతో దాదాపు 12 పురపాలక, నగర పంచాయతీలు కూటమి ఖాతాలో ఏకగ్రీవం కానున్నాయి.

టీడీపీకీ రాజంపేట, బద్వేలు, కమలాపురం, రాయచోటి, పుంగనూరు, నగరి, గుత్తి, దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల ఛైర్పర్సన్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇక జనసేన ఖాతాలోకి దర్శి, బీజేపీకి ఎర్రగుంట్ల దక్కనుంది. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీ, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో వైసీపీ నామినేషన్లు పూర్తిగా తిరస్కరణకు గురికావడం లేదా అభ్యర్థులు నిబంధనల ప్రకారం వేయకపోవడంతో మూడూ టీడీపీ పరం కానున్నాయి.
నామినేషన్ల స్క్రూట్నీ వేళ అధికారులు పెద్ద ఎత్తున అభ్యర్థుల పత్రాలను తిరస్కరించారు. ఆస్తులు, కేసుల వివరాలు దాచడం, డిపాజిట్ రసీదులు జత చేయకపోవడం, స్వీయ ధ్రువీకరణ లోపాలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల బదులు జిరాక్స్ కాపీలు సమర్పించడం వంటి సాంకేతిక తప్పిదాల వల్ల వైసీపీ అభ్యర్థులు పోటీకి దూరమయ్యారు.
ఇక కనిగిరి మున్సిపాలిటీలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీకి పోటీగా నలుగురు స్వతంత్రులు ఉన్నారు. పులివెందులలో 40 వార్డులకు గాను 15 స్థానాల్లో వైసీపీ పోటీ పడలేకపోయింది. నామినేషన్ల పత్రాల లోపాలు, ఆఖరి నిమిషంలో సమయం మించిపోవడం వంటి కారణాలు విపక్షానికి దెబ్బతీశాయి. మొత్తంగా నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసేసరికి మెజారిటీ స్థానాల్లో కూటమి గెలుపు దిశగా అడుగులు వేస్తుండగా, మిగిలిన చోట్ల పోటీ దాదాపు ఏకపక్షంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,665 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మేయర్ స్థానాలకు 34, మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానాలకు 100 నామినేషన్లను అధికారులు తోసిపుచ్చారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల విభాగంలో మరో 1,531 నామినేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో రద్దు చేశారు.
రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థల్లో మేయర్లు, కార్పొరేటర్ పదవుల కోసం మూడు రోజుల వ్యవధిలో మొత్తం 8,537 దరఖాస్తులు అందాయి. అలాగే 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఛైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు మొత్తంగా 17,147 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు సోమవారం వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అనర్హమైన పత్రాలను తోసిపుచ్చారు.
{{/usCountry}}రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థల్లో మేయర్లు, కార్పొరేటర్ పదవుల కోసం మూడు రోజుల వ్యవధిలో మొత్తం 8,537 దరఖాస్తులు అందాయి. అలాగే 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఛైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు మొత్తంగా 17,147 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు సోమవారం వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అనర్హమైన పత్రాలను తోసిపుచ్చారు.
{{/usCountry}}