...
...
Next Story

హైదరాబాద్-బెంగళూరు హైవేపై వంతెన పైనుంచి కిందపడ్డ బస్సు, వాహనం.. 20 మందికి గాయాలు!

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టంది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Published on: Aug 9, 2026, 09:44:01 IST
Advertisement

హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరు గ్రామం సమీపంలోని వంతెన (కల్వర్టు) వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిని, నియంత్రణ కోల్పోయి వంతెన పైనుంచి కిందకు పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులతో పాటు ఇరు వాహనాల డ్రైవర్లు కలిపి దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అనంతపురంలో రోడ్డు ప్రమాదం
అనంతపురంలో రోడ్డు ప్రమాదం

పోలీసులు, స్థానికులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొగరు వంతెనపైకి రాగానే, ఒక ఐషర్ వాహనం దానిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొన్న తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో బస్సు, ఐషర్ వాహనం రెండూ వంతెన రక్షణ గోడను దాటుకుని కిందకు పడిపోయాయి.

అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హైవేపై వెళ్తున్న ఇతర వాహనదారులు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. ప్రమాద తీవ్రతను చూసి వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పామిడి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లను స్థానికుల సహాయంతో పోలీసులు ఎంతో శ్రమించి సురక్షితంగా వెలికితీశారు.

తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మొదట పామిడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం బాధితులను అనంతపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా విచారణ జరుపుతున్నారు. దెబ్బతిన్న వాహనాలను జేసీబీ సాయంతో తొలగించి, హైవేపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe