తెలంగాణ పబ్లిక్ స్కూల్.. విద్యార్థులకు ఫ్రీ బస్సు, పోషకాహారం.. టీపీఎస్ ప్రత్యేకతలు!
సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ పూర్తయింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీనిని తీసుకోవచ్చింది. టీపీఎస్ ప్రత్యేకతలు ఏంటో చూడండి.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు నాంది పలికింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 17న ఆరుట్లలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో రూపొందిన టీపీఎస్ తెలంగాణ విద్యా రంగంలో నూతన విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టనుంది.

కార్పొరేట్‌కు ధీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్
రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి విద్యారంగ బలోపేతానికి సూచనలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డి ల ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది.
ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తున్నారు. అంతేకాదు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగనుంది. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ విద్యకు రోల్ మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది.
పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రజా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆరుట్ల టీపీఎస్ అదుర్స్
కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ వాతావరణం కనిపిస్తోంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, విద్యార్థులకు విశాలమైన ప్లేగ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్‌తో పాటు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు ప్రత్యేక శిక్షకులను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలను సైతం టీపీఎస్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.
నో అడ్మిషన్ బోర్డు
ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్‌లో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు.
తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక 'నో అడ్మిషన్' బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్‌లో నెలకొంది. ఇలా ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం చెబుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


