ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కరికి 47 ర‌కాల ప‌రీక్షలు.. కొత్త ఆరోగ్య సంరక్షణ పథకం!

AP New Health Scheme : ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కరికి 47 ర‌కాల ప‌రీక్షలు చేసే విధంగా వినూత్న ఆరోగ్య సంరక్షణ పథకం మెుదలుకానుంది. ముఖ్యమంత్రి హామీ అమ‌లు దిశ‌గా నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.

Published on: Apr 29, 2026, 21:42:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రోగాల ముంద‌స్తు నివార‌ణ చ‌ర్యలకు ప్రాధాన్యత‌నిస్తూ వ్యక్తుల ప్రస్తుత ఆరోగ్య ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు స‌మ‌గ్ర వైద్య ప‌రీక్షలు చేప‌డ‌తామ‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమ‌లు దిశ‌గా వైద్యారోగ్య శాఖ ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. 104 సంచార వైద్య వాహ‌నాల (MMUs) ద్వారా సాలీనా రూ.162.72 కోట్ల వ్యయంతో గుర్తించిన ప్రతి వ్యక్తికీ 47 ర‌కాల వైద్య ప‌రీక్షలు చేప‌ట్టే ప‌థకానికి వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆమోదం తెలిపారు. ఎన్‌సీడీ స‌ర్వేలో వివిధ జ‌బ్బుల‌పాలైన లేదా అవ‌కాశ‌మున్న వారిగా గుర్తించిన వారితో పాటు సంక్షేమ విద్యా వ‌స‌తి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల‌తో క‌లిపి ఏడాదికి 56 ల‌క్షల 40 వేల మందికి ఒక్కొక్కరికీ 47 ర‌కాల ప‌రీక్షలు చేస్తారు.

మెడికల్ పరీక్షలు
మెడికల్ పరీక్షలు

జ‌బ్బుల‌కు గురైన వారికి చికిత్స అందిస్తున్న ప్రస్తుత విధానానికి భిన్నంగా.. పౌరుల ప్రస్తుత‌ స‌మ‌గ్ర ఆరోగ్య ప‌రిస్థితిని వివిధ ప‌రీక్షల ద్వారా మ‌దింపు చేసి త‌ద్వారా రోగాల‌ను నివారించే దిశ‌గా త‌గు చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప‌లు సంద‌ర్భాల్లో వైద్యారోగ్య శాఖ‌ను ఆదేశించారు. ఈ మేర‌కు విస్తృత చ‌ర్చల‌నంత‌రం 104 వాహ‌నాల ద్వారా అమ‌లుకానున్న పౌరుల ఆరోగ్య త‌నిఖీ(సిటిజ‌న్ హెల్త్ స్క్రీనింగ్‌) ప‌థకానికి మంత్రి ఆమోదం తెలిపారు.

104 సేవ‌లు

ఇప్పటి వ‌ర‌కు 104 సంచార వైద్య వాహ‌నాల ద్వారా గ్రామ స్థాయిలో 15 రోజుల‌కోసారి 6 ర‌కాల ప‌రీక్షలు మాత్రమే జ‌రుగుతున్నాయి. అవి...ర్యాండ‌మ్ బ్లడ్ షుగ‌ర్‌, యూరిన్ షుగ‌ర్, హిమోగ్లోబిన్, మ‌లేరియా వంటి వ్యాధుల నిర్ధార‌ణ‌కు ర్యాపిడ్ డ‌యోగ్నాస్టిక్ టెస్ట్, యూరిన్ అల్బుమిన్, గ‌ర్భధార‌ణ నిర్ధార‌ణ‌కు మూత్ర ప‌రీక్ష. ఇవి కూడా ఎక్కువ భాగం అంత‌గా కచ్చిత‌మైన ఫ‌లితాలివ్వని ర్యాపిడ్ కిట్స్ ద్వారా జ‌రుగుతున్నాయి. దీంతో పాటు గ్రామ, మండ‌ల, జిల్లా స్థాయిల్లో వ్యక్తుల డిసీజ్ ప్రొఫైల్స్, ఎల‌క్ట్రానిక్ హెల్త్ రికార్డుల త‌యారీ కావ‌డంలేదు.

దీనికి భిన్నంగా నూత‌న 104 సేవ‌ల అమ‌ల్లో భాగంగా 11 అంశాల‌కు సంబంధించి గుర్తించిన ప్రతి వ్యక్తికీ మొత్తం 47 ర‌కాల ప‌రీక్షలు జ‌రుగుతాయి.

వీటి వివ‌రాలు: కాలేయ సంబంధిత ప‌రీక్షలు(ఎల్ఎఫ్‌టి)-8, మూత్ర విశ్లేష‌ణ‌-6, కొవ్వు సంబంధిత ప‌రీక్షలు(లిపిడ్ ప్రొఫైల్‌)-5, తెల్ల ర‌క్త క‌ణాల కౌంట్‌-5, ఎర్ర ర‌క్త క‌ణాల కౌంట్-5, ఎల‌క్ట్రొలైట్ ప‌రీక్షలు-4, మూత్ర పిండాల ప‌రీక్షలు(ఆర్ ఎఫ్‌టీ)-3, గ్లూకోజ్ ప‌రీక్షలు-3, కోయాగ్యులేష‌న్ ప‌రీక్షలు(ర‌క్తం గ‌డ్డక‌ట్టడానికి సంబంధించి)-2, ఇఎస్ఆర్( ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి)-1 తోపాటు 5 ఇత‌ర ప‌రీక్షలు.

ప్రయోజ‌నం

ఈ స‌మ‌గ్ర వైద్య ప‌రీక్షల ఫ‌లితాల ఆధారంగా పౌరుల ఆరోగ్య స్థితికి సంబంధించి వ్యక్తిగ‌త స్థాయిలో డిసీజ్ ప్రొఫైల్స్, ఎల‌క్ట్రానిక్‌ హెల్త్ రికార్డుల‌ను రూపొందించి సంజీవ‌ని ప‌థకం కింద ఆయా వ్యక్తుల‌కు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మున్ముందు రోగాల నివార‌ణ‌కు చేప‌ట్టాల్సిన విష‌యాల‌పై త‌గు సూచ‌న‌లు అందించ‌డం జ‌రుగుతుంది. ఈ మేర‌కు ఈ స‌మ‌గ్ర వైద్య ప‌రీక్షల ప్రారంభం రాష్ట్ర ప్రజ‌ల ఆరోగ్య సంర‌క్షణ దిశ‌గా ఎంతో ప్రాముఖ్యమైన చ‌ర్య అని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ వ్యాఖ్యానించారు.

స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ పాత్ర

మొద‌టి ద‌శ‌లో ఐదేళ్ల కాల ప‌రిమితితో కూడిన ఈ ప‌థకంలో భాగంగా.. మొత్తం 904 వాహ‌నాల‌తో 104 సంచార వైద్య సేవ‌ల్ని నిర్వహిస్తున్న స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ప్రతి వాహ‌నంలోనూ సెమీ ఆటోమెటిక్ బ‌యో కెమిస్ట్రీ ఎన‌లైజ‌ర్, సిబిసి మెషీన్ 3 పార్ట్ ఎన‌లైజ‌ర్‌, మైక్రోస్కోప్, ఇంక్యుబేట‌ర్‌ను స్వంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు వివిధ ప‌రీక్షల నిర్వహ‌ణ‌కు అవ‌స‌ర‌మ‌య్యే రిఏజెంట్లను ఇత‌ర వ‌స్తువుల‌ను కూడా స‌మ‌కూర్చాలి. ప్రతి వాహ‌నం రోజుకి 20 మంది చొప్పున నెల‌లో 26 ప‌ని దినాల్లో మొత్తం 520 మందికి 47 చొప్పున ప‌రీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

స‌త్వర ప్రారంభానికి మంత్రి ఆదేశం

విస్తృత ప్రయోజ‌నాల ల‌క్ష్యంగా రూపొందించిన ఈ ప‌థకాన్ని అతి త్వర‌లో ప్రారంభించ‌డానికి త‌గు చ‌ర్యలు చేప‌ట్టాల్సిందిగా శాఖ ఉన్నతాధికారుల‌ను మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆదేశించారు. రెండు నెల‌ల్లో ఈ సేవ‌ల్ని ప్రారంభించ‌డానికి కృషి చేస్తున్నామ‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More