Andhrapradesh Weather Alert : బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో కొత్తగా అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ అల్పపీడన ప్రభావం రాబోయే 24 గంటల్లో తీవ్రతరం కానుంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడన కదలికలతో తీరప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారిపోయే అవకాశం ఉంది
ఈదురుగాలుల హెచ్చరికలు…
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండకూడదని, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని…. గాలి వేగం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అల్పపీడనం కారణంగా సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులుకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. మంగళవారం వరకు వేటకు వెళ్లకూడదని ఆదేశించింది.ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా తీరానికి తిరిగి రావాలని సూచించింది.
ప్రజలు వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా తీరప్రాంత గ్రామాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.