Residence Certificate Update : ఆధార్, రేషన్ కార్డులే అడ్రస్‌ ప్రూఫ్‌.. రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం లేదు!

తహశీల్దార్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవడంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆధార్, రేషన్ కార్డులను అడ్రస్‌ ప్రూఫ్‌లుగా చూపించవచ్చని తెలిపింది.

Published on: Sep 19, 2026, 09:47:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో నివాస ధ్రువీకరణ పత్రాల (Residence Certificate) మంజూరు విధానంపై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి రెవెన్యూ శాఖ క్లారిటీ ఇచ్చింది. సాధారణ పౌరులు నివాస ధ్రువీకరణ కోసం ప్రతిసారీ తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ జీఓ 592లో కీలక మార్పులు చేసింది. ఈ సవరణతో ప్రజలకు ఇబ్బందలు తప్పనున్నాయి.

రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై అప్డేట్
రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై అప్డేట్

పౌరుల వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో నమోదైన చిరునామానే అధికారిక నివాస ధ్రువీకరణగా పరిగణిస్తారు. వీటి ఆధారంగానే అన్ని రకాల ప్రభుత్వ విధులను, సేవలను పొందేందుకు వెసులుబాటు కల్పించారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఉన్న సామాన్య ప్రజలు ప్రత్యేకంగా తహశీల్దార్ ఆఫీస్ నుండి రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ స్పష్టం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి, ఆర్మీ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, కేంద్ర ఉద్యోగాల దరఖాస్తుల కోసం మాత్రమే స్థానిక తహశీల్దార్ నుంచి నివాస ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

ఈనెల 16న రెవెన్యూ శాఖ జీఓ 592ను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరూ తహశీల్దార్ ఆఫీసుల నుంచే నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆధార్, రేషన్ కార్డులనే అడ్రస్ ప్రూఫ్‌గా గుర్తిస్తూ 2015లో జారీ చేసిన జీఓ 581 అమలును నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయంతో మీసేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి, అయోమయం వ్యక్తమయ్యాయి. కొన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జీఓ 592లో తగిన సవరణలు చేస్తూ తాజాగా వివరణ ఇచ్చింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. ప్రవేశాలు, దరఖాస్తుల సమయంలో కుల, ఆదాయ, నివాస సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఇకపై ఉండదు.

చిన్న పనికి కూడా సర్టిఫికెట్లు అడగడం తగ్గడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. డిజిటల్ రికార్డులైన ఆధార్ ఆధారంగా పౌర సేవలను వేగవంతంగా అందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. ప్రభుత్వ సేవలు లేదా స్థానిక అవసరాల కోసం పౌరులు తమ ఆధార్ లేదా రేషన్ కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా ధైర్యంగా సమర్పించవచ్చని అధికారులు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More