...
...
Next Story

ఏపీలో 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత స్మార్ట్ డెస్టినేషన్ సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని సాంకేతికత ఆధారితంగా మార్చే చర్యల్లో భాగంగా 100కు పైగా ప్రధాన పర్యాటక, పుణ్యక్షేత్రాలలో ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టనున్నట్టుగా పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ తెలిపారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అనేక భాషల్లో పర్యాటక సమాచారాన్ని పొందవచ్చన్నారు.

Published on: Oct 8, 2026, 08:37:56 IST
Advertisement

స్పెయిన్‌లోని సెవిల్లెలో ప్రతిష్టాత్మక టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్–2026లో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వినూత్న సేవలను ప్రపంచ వేదికపై ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఏపీ పర్యాటకం
ఏపీ పర్యాటకం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత ఆధునికంగా, స్మార్ట్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎక్స్‌ప్లర్జర్ సంస్థ రూపొందించిన ‘నివు ఏఐ (NiVU AI)’ సేవలను రాష్ట్రంలో విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ‘ASK AI’ QR కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు – 130కి పైగా భాషల్లో ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, ప్రాధాన్యత, స్థానిక విశేషాలు తదితర సమాచారాన్ని పర్యాటకులు సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు.

'తొలి దశలో 30 ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక గమ్యస్థానాల్లో, అనంతరం 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ఈ స్మార్ట్ సేవలను విస్తరించనున్నాం. ఇప్పటికే మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ సాంకేతికతను విజయవంతంగా అమలు చేశాం. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్విన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల సహాయంతో, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్ అడవులు, ప్రకృతి వనరుల సమగ్ర సమాచారాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే వీలు కల్పిస్తున్నాం. తద్వారా పర్యాటకులలో రాష్ట్ర సందర్శనపై మరింత ఆసక్తిని పెంపొందిస్తూ, వారిని ఆంధ్రప్రదేశ్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నాం.' అని మంత్రి దుర్గేష్ అన్నారు.

తిరుమల పవిత్రత నుంచి అమరావతి బౌద్ధ వారసత్వం వరకు...గండికోట అద్భుత ప్రకృతి దృశ్యాల నుంచి మారేడుమిల్లి అరణ్యాలు, అరకు లోయల అందాల వరకు...విశాఖ సముద్ర తీరాల నుంచి రాష్ట్రంలోని అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక గమ్యస్థానాల వరకు ఆంధ్రప్రదేశ్ ఒకే యాత్రలో అపూర్వమైన వైవిధ్యాన్ని అందించే గమ్యస్థానమని మంత్రి దుర్గేష్ చెప్పారు.

స్మార్ట్ డెస్టినేషన్ అంటే కేవలం డేటా లేదా డిజిటల్ సమాచారాన్ని అందించడం కాదని పేర్కొన్నారు. పర్యాటకులకు మెరుగైన అనుభవాన్ని కల్పించడం, స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించడం, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం, పర్యాటకుల అవసరాలను అర్థం చేసుకుని భవిష్యత్ ప్రణాళికలను రూపొందించడం అని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks