దేశంలో తగ్గిన వరి సాగు విస్తీర్ణం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏంటి?

దేశంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. ఎల్ నినో ప్రభావం వ్యవసాయంపై కనిపిస్తుంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు గణాంకాలు వెల్లడించింది.

Published on: Sep 15, 2026, 15:03:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుత 2026 ఖరీఫ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరి సాగు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 11 నాటికి అందిన అధికారిక డేటా ప్రకారం.. దేశంలో వరి సాగు విస్తీర్ణం 4 శాతం మేర తగ్గి 426.81 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయానికి దేశంలో 443.78 లక్షల హెక్టార్లలో వరి పంట సాగవ్వడం గమనార్హం.

తగ్గిన వరి సాగు
తగ్గిన వరి సాగు

దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో వర్షభావ పరిస్థితులు, వర్షపాత లేమి కారణంగా వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో తగ్గిన వరి సాగు విస్తీర్ణం వివరాలు.

కర్ణాటకలో వరి సాగు విస్తీర్ణం 4.54 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 4.46 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 1.90 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 1.84 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్‌లో 1.75 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 1.40 లక్షల హెక్టార్లు, మహారాష్ట్రలో 1.15 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 0.97 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. ఖరీఫ్ సీజన్‌లో అతిముఖ్యమైన ఈ వరి పంట కోతలు అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.

వరి పంట విస్తీర్ణం తగ్గినప్పటికీ, పప్పుధాన్యాల సాగులో స్వల్ప పురోగతి కనిపించింది. గత ఏడాది 116.79 లక్షల హెక్టార్లుగా ఉన్న పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం ఈసారి 118.46 లక్షల హెక్టార్లకు పెరిగింది.

చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 182.48 లక్షల హెక్టార్ల నుండి 183.17 లక్షల హెక్టార్లకు స్వల్పంగా పెరిగింది. నూనెగింజల పంటల విస్తీర్ణం గత ఏడాది 194.07 లక్షల హెక్టార్లుగా ఉండగా, ఈసారి 193.90 లక్షల హెక్టార్లకు తగ్గింది. పత్తి సాగు 110.31 లక్షల హెక్టార్ల నుండి 109.34 లక్షల హెక్టార్లకు పడిపోయింది. చెరకు సాగు విస్తీర్ణం కూడా 58.87 లక్షల హెక్టార్ల నుంచి 58.47 లక్షల హెక్టార్లకు స్వల్పంగా తగ్గింది.

దేశంలో వర్షపాతం లోపించడం వల్ల మొత్తం ఖరీఫ్ పంటల సాగు తగ్గింది. గత సంవత్సరం సెప్టెంబర్ 11 నాటికి మొత్తం ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,112.54 లక్షల హెక్టార్లుగా నమోదు కాగా.. ఈ 2026 సెప్టెంబర్ 11 నాటికి అది 1,096.49 లక్షల హెక్టార్లకు పరిమితమైంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More