అక్టోబర్ 25 నుండి భోగాపురం-న్యూఢిల్లీ మధ్య ఆకాశ ఎయిర్ డైలీ విమాన సర్వీసులు

భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రతిరోజూ విమానాలు ఢిల్లీకి నడవనున్నాయి. విమానాలకు సంబంధించిన షెడ్యూల్ చూడండి.

Published on: Sep 24, 2026, 15:19:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భోగాపురం-న్యూఢిల్లీ మధ్య అక్టోబర్ 25, 2026 నుండి ఆకాశ ఎయిర్ (Akasa Air) ఒక కొత్త విమాన సర్వీసు నడపనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

భోగాపురం-న్యూఢిల్లీ విమాన సర్వీసులు
భోగాపురం-న్యూఢిల్లీ విమాన సర్వీసులు

ఈ విమానం న్యూఢిల్లీ నుండి ఉదయం 5:55 గంటలకు బయలుదేరి, ఉదయం 8:20 గంటలకు భోగాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది భోగాపురం నుండి ఉదయం 9:05 గంటలకు బయలుదేరి ఉదయం 11:30 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది.

విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి వివిధ ప్రాంతాలకు మరిన్ని విమానాలను నడిపేందుకు అనేక విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ అదనపు విమాన సర్వీసు ఉత్తరాంధ్ర ప్రాంతం, న్యూఢిల్లీకి చెందిన ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.

అక్టోబర్ 27 నుంచి భోగాపురం-బ్యాంకాక్

అక్టోబర్ 27 నుంచి భోగాపురం-బ్యాంకాక్ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు విమాన సర్వీసును ప్రారంభించనుంది. ఈ ప్రాంతానికి ఇది ఒక కీలక మలుపు అని విమాన ప్రయాణికులు అభివర్ణిస్తున్నారు. భోగపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అక్టోబర్ 27న ఈ సర్వీసు ప్రారంభం అవుతుంది.

సంవత్సరాల తరబడి చేసిన కృషి ఫలితంగా ఆ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భోగాపురాన్ని బ్యాంకాక్‌తో కలుపుతూ నేరుగా సర్వీసులను నడపనుంది. పెద్ద ఫార్మాస్యూటికల్ రంగం, ఒక ప్రధాన ఓడరేవు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లు, సముద్రపు ఆహార ఎగుమతి మార్కెట్ ఉన్నప్పటికీ.. విశాఖపట్నానికి అంతర్జాతీయ కనెక్టివిటీ ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. విదేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్లు అందుకోవడానికి ప్రయాణికులు, వ్యాపార ప్రతినిధులు సాధారణంగా హైదరాబాద్, చెన్నై లేదా న్యూఢిల్లీ లాంటి వాటిపై ఆధారపడవలసి వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిరంతర విజ్ఞప్తుల ఫలితంగా ఈ సర్వీసు ప్రారంభమవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల. విశాఖపట్నాన్ని థాయిలాండ్ రాజధానితో అనుసంధానించడం ద్వారా ఈ మార్గం పలు ఆర్థిక రంగాలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

విడుదలైన విమాన షెడ్యూల్ ప్రకారం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు ఈ సర్వీసును నడుపుతుంది. ఫ్లైట్ IX 904 ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు బ్యాంకాక్‌లో దిగుతుంది. తిరుగు ప్రయాణ విమానం, IX 903 బుధవారాలు, శనివారాలు తెల్లవారుజామున బ్యాంకాక్ కాలమాన ప్రకారం.. 2.10 గంటలకు బ్యాంకాక్ నుండి బయలుదేరి, భారత కాలమాన ప్రకారం.. తెల్లవారుజామున 3.55 గంటలకు విశాఖపట్నంలో చేరుకుంటుంది. ప్రారంభ వన్-వే ఎకానమీ ఛార్జీలు రూ.16,300 నుండి రూ.19,400 మధ్య ఉండటంతో, ఈ ఫ్లైట్స్ వారాంతపు విహార యాత్రికులకు, కార్పొరేట్ ప్రయాణికులకు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More