Fly91 Tirupati Flights : తిరుపతి – విజయవాడ ప్రయాణికులకు శుభవార్త - కొత్త విమాన సర్వీసులు ప్రారంభం, షెడ్యూల్ ఇలా

తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రికి ఫ్లై91 విమానాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను ప్రారంభించారు. 

Published on: Sep 10, 2026, 17:28:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి విమాన అనుసంధానం మరింత పెరిగింది. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై91 (Fly91) తిరుపతి కేంద్రంగా విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి నగరాలకు కొత్త విమాన సర్వీసులను గురువారం ప్రారంభించింది. తిరుపతి నుంచి బయలుదేరిన తొలి విమానం… విజయవాడ విమానాశ్రయంలో దిగగానే వాటర్ క్యానన్ సెల్యూట్‌తో ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ నూతన సర్వీసును జెండా ఊపి(వర్చువల్) ప్రారంభించారు.

ఫ్లై91 విమానం (ఫైల్ ఫొటో)
ఫ్లై91 విమానం (ఫైల్ ఫొటో)

ఈ కొత్త సర్వీసుల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఫ్లై91కి మూడో గమ్యస్థానంగా మారింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా కలిపి ఈ సంస్థ సర్వీసులు అందిస్తున్న నగరాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఫ్లై91 విమానయాన నెట్‌వర్క్‌లో మొత్తం గమ్యస్థానాల సంఖ్య 13కు చేరుకుంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. "మన దేశంలో తిరుపతి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దేశం నలుమూలల నుంచి రోజువారీగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఇప్పుడు ఫ్లై91 విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడం వల్ల భక్తులకు ప్రయాణం మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

ప్రధాన పుణ్యక్షేత్రంగానే కాకుండా విద్యా, వ్యాపార, పర్యాటక కేంద్రంగా వికసిస్తున్న తిరుపతిని ఈ మూడు కీలక నగరాలతో జోడించడం వల్ల భక్తులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా…. విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కువైట్ వంటి అంతర్జాతీయ నగరాలకు కూడా నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

వారంలో ఏ రోజు ఏ విమానం? వివరాలు

  • తిరుపతి – హైదరాబాద్ : ఈ రెండు నగరాల మధ్య ప్రతిరోజూ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది.
  • తిరుపతి – రాజమండ్రి : వారంలో మూడు రోజులు – సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
  • తిరుపతి – విజయవాడ : వారంలో నాలుగు రోజులు – మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారాల్లో విమానాలు నడుస్తాయి.

తిరుపతి - విజయవాడ మధ్య నడిచే విమానం…. ప్రతిరోజూ ఉదయం 8:05 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. ఉదయం 9:15 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 10:50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

ప్రాంతీయ అనుసంధానమే ప్రధాన లక్ష్యం…

ఆంధ్రప్రదేశ్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించడంపై ఫ్లై91 వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మనోజ్ చాకో హర్షం వ్యక్తం చేశారు. "మా నెట్‌వర్క్‌లో తిరుపతి చేరడం ఎంతో కీలకమైన ఘట్టం. ఏపీలో ప్రాంతీయ అనుసంధానాన్ని బలపరచడంలో ఇది మరో ముందడుగు. తిరుపతిని హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రిలతో నేరుగా అనుసంధానించడం వల్ల ప్రయాణం ఎంతగానో సులువవుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల రోజువారీ ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ఆచరణాత్మక విమాన మార్గాలను అందుబాటులోకి తేవడమే రీజినల్ ఏవియేషన్ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఏటా కోట్లాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. దీనితో పాటు ఏపీలో విద్య, సంస్కృతి, పర్యాటక, వాణిజ్య రంగాల్లో ఈ నగరానికి ప్రత్యేక స్థానముంది. మెట్రోపాలిటన్ నగరమైన హైదరాబాద్‌తో విమాన అనుసంధానం ఏర్పడటం ద్వారా తిరుపతి ప్రయాణికులు ఇక్కడి నుంచి ఇతర దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా సులభంగా అందుకునే వెసులుబాటు లభిస్తుంది.

మొత్తం 13 నగరాలకు విస్తరించిన ఫ్లై91

తిరుపతిని తన నెట్‌వర్క్‌లో చేర్చుకోవడంతో ఫ్లై91 ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 ప్రాంతాలకు విమాన సర్వీసులు అందిస్తోంది. గోవా (మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం, మోపా), సింధుదుర్గ్, జలగావ్, సోలాపూర్, పూణే, బెంగళూరు, హైదరాబాద్, లక్షద్వీప్‌లోని అగత్తి, కొచ్చి, హుబ్లీ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి నగరాలకు ఈ సంస్థ విమానాలను నడుపుతోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More