విజయవాడ నుంచి కీలక నగరాలకు విమాన సర్వీసులు.. మిడిల్ క్లాస్‌కు అనుకూలంగా టికెట్ ధరలు!

విజయవాడ నుంచి ఇతర కీలక నగరాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు ఫ్లై91తో ఏపీ ఛాంబర్స్ ప్రతినిధుల భేటీ అయ్యారు. పలు ప్రతిపాదనలు చేశారు.

Published on: Sep 9, 2026, 21:18:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయవాడ కేంద్రంగా విమాన సర్వీసులను మరింత విస్తరించాలని, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన కీలక నగరాలకు కొత్తగా డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించాలని ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై91’ (FLY91)కు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా కొచ్చి, గోవా, కోయంబత్తూర్, షిర్డీ నగరాలకు విజయవాడ నుంచి నేరుగా విమానాలను నడపాలని కోరింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

'ఫ్లై91' ప్రతినిధుల బృందంతో ఏపీ ఛాంబర్స్ నిర్వహించిన ఇంటరాక్టివ్ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. గురువారం నుంచి ప్రారంభం కానున్న నూతన విమాన సర్వీసుల సందర్భంగా ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, సీనియర్ నిర్వాహకులు బి. రాజశేఖర్, ఆర్. సుబ్బారావు విమానయాన సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ-తిరుపతి, రాజమండ్రి-తిరుపతి, హైదరాబాద్-తిరుపతి మార్గాల్లో తాము నడపబోయే ప్రాంతీయ విమాన సర్వీసుల వివరాలను ఫ్లై91 యాజమాన్యం ఈ సమావేశంలో వివరించింది. ఈ నూతన సర్వీసుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా వ్యాపారవేత్తలు, పర్యాటకులు, సాధారణ ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

విజయవాడ నుంచి దక్షిణాది వాణిజ్య, ఆధ్యాత్మిక కేంద్రాలైన కొచ్చి, గోవా, కోయంబత్తూర్, షిర్డీలకు విస్తృతమైన ప్రయాణ డిమాండ్ ఉందని ఏపీ ఛాంబర్స్ స్పష్టం చేసింది. ఈ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించడం వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతో పాటు విమానయాన సంస్థకు కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని, దీనిపై సాధ్యాసాధ్యాల అధ్యయనం చేపట్టాలని సూచించింది.

విజయవాడ విమానాశ్రయంలో అక్టోబర్ 2026 నాటికి నూతనంగా నిర్మిస్తున్న సమగ్ర టెర్మినల్ అందుబాటులోకి రానుండటం, విమానాల పార్కింగ్ సామర్థ్యం పెరగనున్న నేపథ్యంలో విజయవాడను ఒక ప్రాంతీయ ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని పొట్లూరి భాస్కరరావు ప్రతిపాదించారు.

విమాన సర్వీసులను వేగంగా విస్తరించడానికి ప్రాథమిక చర్యగా కనీసం రెండు విమానాలను రాత్రివేళల్లో విజయవాడ విమానాశ్రయంలోనే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాంతీయ ప్రయాణాలకు అత్యంత అనుకూలమైన ఏటీఆర్ రకం చిన్న విమానాలను ఫ్లై91 నడుపుతున్నందున, తక్కువ వ్యవధి కలిగిన షార్ట్-హాట్ రూట్లపై దృష్టి సారిస్తే కార్యకలాపాల సామర్థ్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

విమానయాన రంగంలో ప్రయాణికులను ఆకట్టుకోవడానికి, సుదీర్ఘకాలం అభివృద్ధి పథంలో సాగడానికి కొన్ని కీలక ప్రమాణాలు పాటించాలని ఛాంబర్స్ ప్రతినిధులు నొక్కిచెప్పారు. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్స్ ప్రాతిపదికన మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ధరలు ఉండాలన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు సరైన సమయానికి విమానాలు నడపడం అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పారు. ప్రయాణికులకు నిరంతరం నమ్మకమైన కనెక్టివిటీని అందించడం ద్వారానే సంస్థపై ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏపీలోని ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు నేరుగా విమాన రవాణా సదుపాయం పెరిగితే రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు, టూరిజం గణనీయంగా పుంజుకునే అవకాశం ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More