రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనను ఆదివారం అర్ధరాత్రి ఆలస్యంగా కోర్టులో హాజరుపరిచారు.

Published on: Feb 2, 2026, 09:43:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటి రాంబాబుకు BNSS సెక్షన్ 35 (CrPC 41A) కింద నోటీసులు అందజేయాలని, అతనిపై నమోదైన మరో కేసుకు సంబంధించి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

అంబటి రాంబాబు
అంబటి రాంబాబు

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటి రాంబాబును శనివారం రాత్రి గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో వాంగ్మూలాలు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరుపరిచే ముందు, వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.

కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు తనను శారీరకంగా వేధించారని న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు అంబటి చెప్పినట్టుగా తెలుస్తోంది. రాత్రి వేళల్లో తనపై దుర్భాషలాడుతున్నారని, చట్టపరమైన సహాయం, పోలీసు స్టేషన్‌లో తనను కలవడానికి వచ్చేవారికి అనుమతి నిరాకరించారని రాంబాబు కోర్టులో తన బాధను వ్యక్తం చేశారని సమాచారం.

నల్లపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వంశీ, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతో కలిసి తనను శారీరకంగా వేధించారని అంబటి ఆరోపించారు. అధికారులు తన కాళ్లను బలవంతంగా విడదీసి బాధపెట్టారని, ఫలితంగా తన కాళ్లలో తీవ్రమైన నొప్పి వచ్చిందని రాంబాబు కోర్టుకు తెలిపినట్టుగా తెలుస్తోంది. తనపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, పోలీసులు దానిని నమోదు చేయడానికి నిరాకరించారని న్యాయమూర్తికి చెప్పారు.

రాంబాబు రాష్ట్రవ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడని, సమాజంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More