Royal Enfield Investment : ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి - రూ. 2,200 కోట్లతో తయారీ కేంద్రం, 5 వేల ఉద్యోగవకాశాలు

Royal Enfield Investment in AP : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడుతోంది. తిరుపతి జిల్లా సత్యవేడులో రూ. 2,200 కోట్లతో భారీ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ SIPB ఆమోదం తెలిపింది.

Published on: May 7, 2026, 15:08:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Royal Enfield Andhra Pradesh Investment : ఏపీ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడి రానుంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' తన నూతన తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐషర్ మోటార్స్ యాజమాన్యంలోని ఈ సంస్థ… తిరుపతి జిల్లా సత్యవేడులో సుమారు రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు వెండార్ పార్కును నిర్మించనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ (ఫైల్ ఫొటో)
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ (ఫైల్ ఫొటో)

భారీగానే ఉద్యోగ, ఉపాధి వకాశాలు…

తమిళనాడు వెలుపల రాయల్ ఎన్‌ఫీల్డ్ చేపడుతున్న మొట్టమొదటి భారీ విస్తరణ ప్రాజెక్ట్ ఇదే కావటం విశేషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. బుధవారం రాత్రి విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం….. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లోని సత్యవేడు మండలం వనెల్లూరు - రాళ్లకుప్పం గ్రామాల్లో ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి ఈ కొత్త ప్లాంట్ సుమారు తొమ్మిది లక్షల యూనిట్లను అదనంగా చేర్చనుంది. ఇది ప్రపంచ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ కేంద్రంగా భారత దేశ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది.

కేవలం బైకుల తయారీ యూనిట్ మాత్రమే కాకుండా….. ఒక ప్రత్యేక 'వెండార్ పార్క్'ను కూడా ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే అనుబంధ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తాయి. తద్వారా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ఒక పటిష్టమైన ఆటోమొబైల్ క్లస్టర్ రూపుదిద్దుకోనుంది.

రెండు దశల్లో ప్రాజెక్ట్ పూర్తి

ఈ మెగా ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ పనులను 2029 నాటికి పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు.ఇక రెండో దశను 2032 నాటికి పూర్తి చేస్తారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థ ఏపీని ఎంచుకోవడం రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలకు, మౌలిక సదుపాయాల నాణ్యతకు నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన మరియు సరళమైన పారిశ్రామిక విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ రాకతో రాయలసీమ ప్రాంత పారిశ్రామిక ముఖచిత్రం మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More