New SUV : ఎంజీ మోటార్ నుంచి కొత్త ఎస్‌యూవీ- టోటల్ రేంజ్ 1,100 కి.మీలు! లాంచ్ ఎప్పుడంటే..
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అక్టోబర్‌లో సరికొత్త భారీ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ఇది భారత మాస్-మార్కెట్లోనే తొలి ‘ప్లగ్-ఇన్ హైబ్రిడ్’, పూర్తి ఎలక్ట్రిక్ (ఈవీ) వేరియంట్లలో వస్తోంది. 1,100 కి.మీల టోటల్ రేంజ్ ఇచ్చే ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఎంజీ మెజెస్టిర్ ఆవిష్కరణ సందర్భంగా సంస్థ కీలక ప్రకటన చేసింది. రానున్న అక్టోబర్ నాటికి ఒక భారీ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. అసలు విశేషం ఏంటంటే.. ఈ కారు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ (ఈవీ) వెర్షన్‌తో పాటు భారతీయ మాస్-మార్కెట్లోనే తొలి 'ప్లగ్-ఇన్ హైబ్రిడ్' (పీహెచ్ఈవీ) ఎస్‌యూవీగా అడుగుపెట్టనుంది.

ప్రస్తుతం మన మార్కెట్లో టయోటా వంటి కంపెనీలు స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లను విక్రయిస్తుండగా, చార్జింగ్ పెట్టుకోగలిగే 'ప్లగ్-ఇన్ హైబ్రిడ్' సాంకేతికతను సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్న తొలి సంస్థగా ఎంజీ నిలవబోతోంది.
ఎంజీ కొత్త ఎస్‌యూవీ- డిజైన్, ప్లాట్‌ఫారమ్ విశేషాలు..
కోడ్ నేమ్ '520'తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్, అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘వులింగ్ స్టార్‌లైట్ 560’ ఎస్‌యూవీ ఆధారంగా రూపొందుతోంది.
డైమెన్షన్స్: ఈ ఎస్‌యూవీ 4,745 ఎంఎం పొడవు, 1,850 ఎంఎం వెడల్పు, 1,755 ఎంఎం ఎత్తు కలిగి ఉంటుంది. ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కంటే దాదాపు 50 ఎంఎం అదనపు పొడవును, 60 ఎంఎం ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉండటం గమనార్హం.
రూపం: 5, 7 సీటర్ ఆప్షన్లలో లభించే ఈ కారు.. ముందు భాగంలో భారీ గ్రిల్, మందపాటి బంపర్లతో గంభీరంగా కనిపిస్తుంది. వెనుక వైపు నుంచి చూస్తే ఒక లగ్జరీ ఎంపీవీ తరహాలో దీని డిజైన్ ఉంటుంది.
ఎంజీ కొత్త ఎస్‌యూవీ- పవర్‌ట్రెయిన్: రేంజ్ అదిరిపోతుంది!
ఈ కొత్త ఎస్‌యూవీలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సాంకేతికత ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
పీహెచ్ఈవీ వెర్షన్: ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 100 కి.మీ మైలేజీని ఇస్తుంది. పెట్రోల్, బ్యాటరీ కలిపి మొత్తం 1,100 కి.మీల సుదీర్ఘ ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈవీ వెర్షన్: పూర్తి ఎలక్ట్రిక్ వేరియంట్‌లో 56.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై సుమారు 500 కి.మీల రేంజ్ ఇస్తుందని అంచనా. కేవలం 20 నిమిషాల్లోనే 30-80 శాతం వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది.
ఎంజీ కొత్త ఎస్‌యూవీ- ధర, పోటీ..
ఈ కొత్త ఎస్‌యూవీ ధర విషయంలో కూడా ఎంజీ దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది.
పీహెచ్ఈవీ మోడల్: ఇది మార్కెట్లోకి వస్తే దీనికి నేరుగా పోటీదారులు లేరు. ధర పరంగా టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వంటి కార్లకు సవాల్ విసరవచ్చు.
ఈవీ మోడల్: ఇది మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో తలపడనుంది. దీని ధర సుమారు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.
వచ్చే పండగ సీజన్‌లోగా (అక్టోబర్ 2026) ఈ కారు రోడ్లపైకి రానుంది. ఇది ఎంజీ ప్రీమియం షోరూమ్‌లైన 'ఎంజీ సెలెక్ట్' ద్వారా విక్రయిస్తారా లేదా సాధారణ డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి తెస్తారా అనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- ఎంజీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ప్రత్యేకత ఏమిటి?
సమాధానం- సాధారణ హైబ్రిడ్ కార్లలా కాకుండా, ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును ఎలక్ట్రిక్ వెహికల్‌లాగే విడిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కేవలం బ్యాటరీ పవర్‌తోనే సుమారు 100 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే, పెట్రోల్ ఇంజిన్ సహాయంతో ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. పెట్రోల్, విద్యుత్ రెండింటినీ కలిపి ఉపయోగిస్తే ఈ కారు ఏకంగా 1,100 కి.మీల సుదీర్ఘ రేంజ్‌ను అందిస్తుంది.
ప్రశ్న- ఈ కొత్త ఎంజీ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదలవుతుంది?
సమాధానం- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏడాది అక్టోబర్‌లో (పండుగ సీజన్ నాటికి) ఈ భారీ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అనే రెండు ఆప్షన్లలో లభించనుంది. దీని ధర,యు అధికారిక బుకింగ్స్ వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


