రాష్ట్రంలోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడే తిప్పలకు ఉపశమనం కలిగించేలా సరికొత్త సేవలను తీసుకొచ్చింది. ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసుకునేలా… రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవలను రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ధాన్యం సేకరణ ప్రక్రియను సరళీకృతం చేయడానికి మరియు రైతులు ఇకపై సేకరణ కేంద్రాల వద్ద వేచి ఉండకుండా ఈ వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. వాట్సాప్ ఆధారంగా స్లాట్లు బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.
స్లాట్ బుకింగ్ ఇలా…
ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ ఆధారంగా స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి రైతులు 7337359375 కు "హాయ్" అనే సందేశం పంపాలి. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుంది. ఆధార్ నంబర్ నమోదు చేయడంతో వారి పేరును ధృవీకరిస్తుంది. ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఎంచుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న తేదీలను కూడా డిస్ ప్లే చేస్తుంది.
రైతులు తాము విక్రయించాలనుకుంటున్న వరి రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. సంచుల సంఖ్యను పేర్కొనొచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత కూపన్ కోడ్ జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.
ఈ వ్యవస్థ ద్వారా రైతులు తాము ఎంచుకున్న తేదీ మరియు సమయంలో ఆలస్యం చేయకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించటానికి వీలు కల్పిస్తుందని మంత్రి మనోహర్ తెలిపారు. సేకరణ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు లేకుండా చేయటంతో పాటు సమర్థవంతంగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయటమే ఈ సేవల లక్ష్యమని ప్రభుత్ అధికారులు చెబుతున్నారు.
- ధాన్యం కొనుగోలు చేసే రైతులు ముందుగా '7337359375 కు "హాయ్" అనే సందేశం పంపాలి.
- రైతులు మొదట తమ ఆధార్ నెంబర్ నమోదు చేసేకోవాలి.
- ఆ తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. తర్వాత ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి.
- ఏ రోజు అమ్మాలనుకుంటున్నారో.. ఆ తేదీకి సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలి. అనంతరం సమయాన్ని కూడా ఎంచుకోవాలి.
- రైతు ఎలాంటి రకం ధాన్యం, ఎన్ని బస్తాల రూపంలో అమ్ముతున్నారు అన్నది అక్కడ నమోదు చేయాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన ఓ కూపన్ కోడ్ వస్తుంది.
- చివరగా రైతులు సులభంగా తమ ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకునేందుకు వీలవుతుంది.