Andhrapradesh Ports : ఏపీలో మూడు పోర్టుల విస్తరణ - 6 వేల ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్

Andhrapradesh Ports : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల రెండో విడత విస్తరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1,638 కోట్ల వ్యయంతో 6,248 ఎకరాల భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

Published on: Jul 16, 2026, 16:37:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రూపురేఖలను మార్చేలా, సముద్ర తీర ఆధారిత పరిశ్రమలకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన ఓడరేవుల (పోర్టుల) రెండో విడత (ఫేజ్-2) విస్తరణ పనుల కోసం భారీగా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీలో మూడు పోర్టుల విస్తరణ
ఏపీలో మూడు పోర్టుల విస్తరణ

శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుల అభివృద్ధి కోసం రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,248 ఎకరాల భూమిని సేకరించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఈ భూసేకరణకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఈ భూసేకరణకు అయ్యే ఖర్చును పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (APMB) తన సొంత వనరుల నుంచి భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ మూడు పోర్టుల అభివృద్ధి రాష్ట్రానికి ఎంతో కీలకం కానుంది.

ఏ పోర్టుకు ఎంత భూమి..? ఎంత ఖర్చు..?

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు పోర్టుల రెండో విడత భూసేకరణ వివరాలు ఇలా ఉన్నాయి:

  • మూలపేట పోర్టు (శ్రీకాకుళం): ఈ ఓడరేవు విస్తరణ కోసం 1,903 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇందుకోసం రూ.440 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లోనే భూమి కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం, పునరుద్ధరణ (R&R) ప్యాకేజీల ఖర్చులు కూడా కలిసి ఉన్నాయి.
  • మచిలీపట్నం పోర్టు (కృష్ణా): బందరు పోర్టుగా పిలిచే ఈ ప్రాజెక్ట్ ఫేజ్-2 అభివృద్ధి కోసం 1,421 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.347 కోట్లను కేటాయించింది.
  • రామాయపట్నం పోర్టు (నెల్లూరు): ఈ మూడు పోర్టుల్లోకెల్లా అత్యధికంగా రామాయపట్నం పోర్టు విస్తరణ కోసం భూమిని సేకరిస్తున్నారు. ఇక్కడ 2,924 ఎకరాల భూసేకరణ కోసం రూ.851 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

ఈ పోర్టుల నిర్మాణం పూర్తయితే ఏపీ సముద్ర తీర ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో వృద్ధి చెందుతుందని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులకు కేంద్రాలుగా మారి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More