...
...
Next Story

ASEAN India Maritime Conclave : ఏపీ మారిటైమ్ పాలసీ కింద 5 వేల మందికి శిక్షణ - మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

పోర్ట్ కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలతో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విశాఖలో జరిగిన ఆసియాన్-ఇండియా మారిటైమ్ సదస్సులో ప్రసంగిస్తూ… పలు అంశాలను వివరించారు.

Published on: Nov 23, 2026, 18:07:37 IST
Advertisement

ఆగ్నేయాసియా దేశాలతో దీర్ఘకాలిక సముద్ర భాగస్వామ్యాన్ని (మారిటైమ్ పార్టనర్‌షిప్) ఏర్పరచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంతో ఆసక్తిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పోర్ట్ కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన 'ఆసియాన్-ఇండియా మారిటైమ్ కాంక్లేవ్లో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

వేగంగా విస్తరణ…

విశాఖలో ఆసియాన్-ఇండియా మారిటైమ్ సదస్సు
విశాఖలో ఆసియాన్-ఇండియా మారిటైమ్ సదస్సు

రాష్ట్రంలో ఓడ రేవుల మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వ్యవస్థ, డిజిటల్ కనెక్టివిటీని వేగంగా విస్తరిస్తున్నట్లు లోకేశ్ వివరించారు. తద్వారా దేశంలోనే అత్యంత కీలకమైన సముద్ర, పారిశ్రామిక ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన తెలిపారు.

"మెరుగైన పోర్ట్ కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఆగ్నేయాసియా దేశాలతో దీర్ఘకాలిక సముద్ర భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు మేము ఎంతో ఆసక్తిగా ఉన్నాం" అని లోకేశ్ పేర్కొన్నారు.

భారత తూర్పు తీరానికి, ఆగ్నేయాసియాకు మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను మంత్రి గుర్తుచేశారు. ప్రాచీన కాలంలో కళింగపట్నం, మచిలీపట్నం వంటి ఓడరేవులు ఈ ప్రాంతాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక మార్పిడికి వారధులుగా నిలిచాయని ఆయన వివరించారు.

సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 వంటి కార్యక్రమాల ద్వారా భారత సముద్ర రంగానికి కొత్త ఊపు లభిస్తోందని లోకేశ్ అన్నారు. నౌకా నిర్మాణం, సముద్ర రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం రూ. 25,000 కోట్ల మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్‌తో సహా సుమారు రూ. 70,000 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్ట్ రికార్డు స్థాయిలో 91.1 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి, సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేసిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోనూ, పొరుగు ప్రాంతాల్లోనూ పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలలో నాలుగు కొత్త ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ - మంత్రి లోకేశ్

దుగరాజపట్నంలో సుమారు రూ. 30,000 కోట్ల పెట్టుబడితో నౌకానిర్మాణ (షిప్ బిల్డింగ్) క్లస్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని లోకేశ్ తెలిపారు. గత వారం విశాఖపట్నంలో పోర్ట్ విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినల్స్, ఓడల మరమ్మతులకు సంబంధించి సుమారు రూ. 7,500 కోట్ల విలువైన ఐదు కీలక ఒప్పందాలు కుదిరాయని గుర్తుచేశారు."ఓడరేవులను పరిశ్రమలతో అనుసంధానించడం, ఆ పరిశ్రమలను ప్రపంచ మార్కెట్లతో కలపడమే మా ప్రధాన లక్ష్యం," అని మంత్రి స్పష్టం చేశారు.

గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి కేంద్రంగా ఏపీ…

క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, త్వరలోనే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఎగుమతుల్లో ప్రధాన కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

కాకినాడలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత, జపాన్‌కు చెందిన జెరా (JERA) సంస్థకు ఏటా సుమారు 70,000 టన్నుల గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేసేందుకు ఏఎం గ్రీన్ (AM Green) ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. గ్రీన్ ఫ్యూయల్స్, సుస్థిర షిప్పింగ్ రంగాల్లో ఇలాంటి భాగస్వామ్యాలను అన్వేషించాలని ఆసియాన్ దేశాలను ఆయన ఆహ్వానించారు.

రాష్ట్ర మారిటైమ్ పాలసీ కింద 2028 నాటికి 5,000 మంది సముద్ర రంగ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేశ్ తెలిపారు. "నౌకానిర్మాణం, మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మారిటైమ్ టెక్నాలజీ రంగాల్లో యువతను ఉపాధికి సిద్ధం చేసేందుకు సాంకేతిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది," అని ఆయన వివరించారు.

జువ్వలదిన్నె వద్ద మానవరహిత సముద్ర వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని లోకేశ్ చెప్పారు. ఐఐటీ తిరుపతి, ఆంధ్రా విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో అక్కడ ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆ సంస్థను ఆహ్వానించినట్లు తెలిపారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks