రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరంలలో కొత్తగా పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగు నూతన కమిషనరేట్లకు డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) లేదా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారులు కమిషనర్లుగా వ్యవహరించనున్నారు.

ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్‌కుమార్ గుప్తా సమర్పించిన సమగ్ర ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నాలుగు వేర్వేరు జీవోలను వెలువరించారు.
ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలు.. సరిహద్దులు ఇలా….
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 14(6) ప్రకారం నూతన కమిషనర్లకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలను ప్రభుత్వం కల్పించింది. ఫలితంగా నగరాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర నిర్ణయాల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆయా రెవెన్యూ, పోలీసు జిల్లాల సరిహద్దులనే ఈ నూతన కమిషనరేట్లకు కూడా సరిహద్దులుగా ఖరారు చేశారు.
ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా నూతన పోస్టులను సృష్టించలేదు. వివిధ విభాగాల్లో అదనంగా ఉన్న క్యాడర్ పోస్టులను, డీఐజీ స్థాయి స్థానాలను సర్దుబాటు చేస్తూ ఈ కమిషనరేట్లకు కేటాయించారు.
- గుంటూరు పోలీసు కమిషనరేట్ : రాజధాని ప్రాంత భద్రతను దృష్టిలో ఉంచుకుని గుంటూరు, గుంటూరు రూరల్, రాజధాని అమరావతి ప్రాంతం, తెనాలి జోన్లతో ఈ కమిషనరేట్‌ను రూపుదిద్దారు. దీని పరిధిలో గుంటూరు ఈస్ట్, వెస్ట్, గుంటూరు రూరల్, తుళ్లూరు, మంగళగిరి, తెనాలి సబ్ డివిజన్‌లు అంతర్భాగంగా పనిచేస్తాయి.
- రాజమహేంద్రవరం పోలీసు కమిషనరేట్: గోదావరి తీరంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు మూడు శాంతిభద్రతల విభాగాల జోన్‌లతో ఈ కమిషనరేట్‌ను నిర్మించారు. ఇందులో సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, కొవ్వూరు సబ్ డివిజన్‌లు ఉంటాయి.
- తిరుపతి పోలీసు కమిషనరేట్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ జోన్లతో ఈ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, శ్రీసిటీ, పుత్తూరు, నాయుడుపేట సబ్ డివిజన్‌లు దీని పరిధిలో పనిచేస్తాయి.
- కర్నూలు పోలీసు కమిషనరేట్: రాయలసీమలోని కీలక నగరమైన కర్నూలులో రెండు శాంతిభద్రతల జోన్‌లతో కమిషనరేట్ రూపుదిద్దుకుంది. కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్‌లు దీని కిందకు వస్తాయి.