'రైతన్నా...మీకోసం' - పంచ సూత్రాలతో ఏపీ సర్కార్ సరికొత్త ఫ్లాన్..! 7 రోజుల పాటు కార్యక్రమాలు
ఈ నెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ అనే కొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా వ్యవసాయంలో ‘పంచసూత్రాలు’ అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. నవంబర్ 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది.

ఈనెల 24 నుంచి 29 వరకు…
ఈనెల 24వ తేదీ నుంచి 29వ ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10 వేలమందితో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అన్నదాతల సంక్షేమం కోసం, సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి ప్రకటించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా శాఖలకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మీకోసం రైతన్నా పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనుంది.
ఈ సందర్భంగా టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....‘17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు ముందుకెళ్తున్నాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద దాదాపు 46.50 లక్షల మందికి పైగా రైతులకు రెండు విడతలుగా రూ.14 వేలు జమ చేశాం. రెండు విడతల్లో కలిపి రూ.6,310 కోట్లు రైతులకు చెల్లించాం. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఇలాంటి వాటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను ప్రకటించాం" అని తెలిపారు.
“నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టాం. ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతలకూ అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలి. దీంతో పాటు వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించాలి. ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి” అని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- "రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించాలి.
- శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నాం.
- రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలి. కడపలో ప్రకృతి సాగును కూడా పరిశీలించాను. ఆ సాగు రైతులు చాలా సంతృప్తిగా ఉన్నాయి. ప్రైవేట్ ఎరువుల షాపుల కంటే గ్రోమోర్ కేంద్రాల్లోని ఎరువుల ధర తక్కువగా ఉంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలి.
- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు కలుగుతుంది. రైతులు ఏ పంటలు సాగు చేశారు... వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకోవాలి.
- సాగులో పురుగుమందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలి. దీంతో పాటు తక్కువ వినియోగం వల్ల కలిగే లాభాలను, సేంద్రీయ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందనేది వివరించాలి.
- పూర్తి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా రిజర్వాయర్లను నింపగలిగాం. అలాగే సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలను రైతులకు చెప్పాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

