శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయిస్తాం - సీఎం చంద్రబాబు ప్రకటన

శ్రీ సిటీకి 6వేల ఎకరాలు భూములిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అభివృద్ధికి మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీసిటీలో కంపెనీల ప్రారంభోత్స సదస్సులో మాట్లాడిన ఆయన.. రూ.1201 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసే రేమాండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 

Published on: Nov 15, 2025 4:41 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే శ్రీసిటీని అభివృద్ధికి మోడల్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజైన శనివారం నాడు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీసిటీలోని ఏర్పాటైన 5 కంపెనీలను ప్రారంభించారు.

శ్రీసిటీలో పలు కంపెనీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
శ్రీసిటీలో పలు కంపెనీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

శ్రీసిటీలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”భారత దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక టౌన్ షిప్ శ్రీసిటి. శ్రీసిటి నుంచే డైకెన్, ఇసుజూ, క్యాడ్బరీ లాంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన పరిశ్రమలు ఈ శ్రీసిటీ పారిశ్రామిక టౌన్ షిప్ కు రావాలి" అని పిలుపునిచ్చారు.

6 వేల ఎకరాల భూమిని కేటాయిస్తాం - సీఎం

గడిచిన రెండు రోజులుగా రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. “మొత్తంగా గడచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. త్వరలోనే శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తాం. 50 దేశాలకు పైగా కంపెనీలు శ్రీసిటీ నుంచి పని చేస్తాయి. 1.50 లక్షల మంది ఉద్యోగాలతో శ్రీ సిటీ అభివృద్ధి మోడల్ గా మారుతుంది. శ్రీసిటీ సమీపంలోనే ఎయిర్ స్ట్రిప్ నిర్మించే దిశగా ఆలోచన చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శ్రీ సిటీ తరహా మోడల్స్ మరిన్ని రావాల్సి ఉంది.2028 నాటికి శ్రీ సిటినీ ఓ బెస్ట్ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తాం” అని అభిప్రాయపడ్డారు.

“రాయలసీమలో ఇప్పటికే చాలా పరిశ్రమలు వచ్చాయి. 2014-2019 మధ్యకాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని తెచ్చాం. ఇక రాయలసీమ ప్రాంతంలోనే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నాం. ఏరోస్పేస్, డిఫెన్సు కారిడార్లు వస్తున్నాయి. ఇప్పుడు అనంతపురం జిల్లాకు రేమాండ్స్ సంస్థ వచ్చింది.. పెట్టబుడులు పెడుతోంది. కియా దగ్గర్లోనే రేమాండ్స్ సంస్థ ఆటో కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంటును రేమాండ్స్ ఏర్పాటు చేయబోతోంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3-4 ఏళ్లలోనే చేరుకుంటాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

2027 నాటికి ప్రారంభం…

"2027 నాటికి ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తామని రేమాండ్ హామీ ఇచ్చింది. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల్ని ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. విమానాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటి ఉత్పత్తి కూడా మరింత పెరగాలి. రేమాండ్ గ్రూప్ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా ఉత్పత్తులు తయారు చేయటం అభినందనీయం” అని ముఖ్యమంత్రి అన్నారు.

రేమాండ్స్ గ్రూప్ గౌతమ్ మైనీ మాట్లాడుతూ... ఏపీలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు వస్తున్నాయని అన్నారు. అలాగే వివిధ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీలు బాగున్నాయని గౌతమ్ మైనీ కితాబిచ్చారు. ఏపీ అభివృద్ధిలో భాగంగా తాము ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్ రంగాల్లో అడుగు పెట్టామన్నారు.

రేమాండ్స్ గ్రూప్ రాష్ట్రంలో రూ.1201 కోట్ల పెట్టుబడితో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. సిల్వర్ స్పార్క్ అపారెల్ పార్క్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఈ సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి.

రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్, గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగనుంది.

ఇక శ్రీసిటీలో మొత్తంగా 12 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2320 కోట్ల విలువైన పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. శ్రీసిటీలో ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా ఉత్పత్తుల ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది.