తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ (నవంబర్ 16) జరగనున్న వార్షిక పుష్పయాగానికి ఆదివారం రాత్రి వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు ఈ వైదిక క్రతువును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంకురార్పణ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది.
ఋత్విక్‌వరణం, విష్వక్సేన ఆరాధన

పుష్పయాగ మహోత్సవాలకు ముందుగా ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. వైదిక కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు అర్చకులకు వివిధ బాధ్యతలు అప్పగించడాన్నే ఋత్విక్‌వరణం అంటారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞతోనే తమకు ఈ విధులు దక్కాయని అర్చకులు భావిస్తారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం పూర్తి చేసి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవాళ పుష్పయాగం - పలు సేవలు రద్దు….
ఇవాళ పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
- స్నపనతిరుమంజనం : ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపనతిరుమంజనం (అభిషేకం) నిర్వహిస్తారు.
- పుష్పయాగం : మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రకరకాల సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి కన్నులపండువగా పుష్పయాగం చేస్తారు.
- సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
పుష్పయాగం నేపథ్యంలో ఇవాళ ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి స్వామివారి దర్శనానికి సహకరించాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}పుష్పయాగం నేపథ్యంలో ఇవాళ ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి స్వామివారి దర్శనానికి సహకరించాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}