...
...
Next Story

Cyclone Akvan : బంగాళాఖాతంలో మరో తుపాను అక్వాన్.. ఏపీకి ముప్పు ఉందా?

Cyclone Akvan : నవంబర్ 18 నాటికి మధ్య బంగాళాఖాతంలో అక్వాన్(Cyclone Akvan) తుపాను ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ, బెంగాల్ తీరాలపై ప్రభావం, ఐఎండీ తాజా హెచ్చరికల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Published on: Nov 13, 2026, 15:18:58 IST
Advertisement

బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారుతోంది. ఇప్పటికే వరుస తుపానులతో వణికిపోయిన తీర ప్రాంతాలకు ఇప్పుడు మూడో తుపాను ముప్పు పొంచి ఉంది. నవంబర్ 18 నాటికి మధ్య బంగాళాఖాతంలో ఈ సీజన్‌లో మూడో తుపాను ఏర్పడే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తాజాగా వెల్లడించింది. ఒకవేళ ఇది తుపానుగా బలపడితే దీనికి అక్వాన్ అని నామకరణం చేయనున్నారు.

బంగాళాఖాతంలో మరో తుపాను
బంగాళాఖాతంలో మరో తుపాను

దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల వేగం వంటి పర్యావరణ పరిస్థితులు అనుకూలిస్తే, ఈ వాయుగుండం మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తుపానులకు ప్రపంచ వాతావరణ సంస్థ నిబంధనల ప్రకారం సభ్య దేశాలు వరుస క్రమంలో పేర్లు పెడతాయి. ఈసారి తుపానుకు పేరు పెట్టే వంతు ఇరాన్ దేశానిది. ఇరాన్ సూచించిన జాబితా ప్రకారం ఈ తుపానుకు అక్వాన్ అని పేరు పెట్టనున్నారు. అక్వాన్ అంటే దుష్ట ఆలోచన లేదా చెడు మనసు అని అర్థం.

ఇప్పటికే ఈ సీజన్‌లో వచ్చిన అర్ణబ్, మురసు తుపానుల తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడనున్న మూడో తుపాను ఇదే. ఈ సీజన్‌లో ఇంతకుముందు ఏర్పడిన అర్ణబ్ అక్టోబర్ చివరలో ఏపీ తీరంపై ప్రభావం చూపింది, మురసు నవంబర్ ఆరంభంలో తూర్పు తీరాన్ని వణికించింది. రాబోయే అక్వాన్ తుపాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలను తాకే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు, అమరావతిలోని భారత వాతావరణ శాఖ (IMD) కేంద్రం ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తూ సముద్రంలో గాలుల తీవ్రతపై హెచ్చరికలు జారీ చేసింది.

నవంబర్ 14 నుంచి 17 మధ్యలో అండమాన్ సముద్ర ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. నైరుతి బంగాళాఖాతంలో గాలుల వేగం మరింత పెరిగి గంటకు 45-55 కి.మీ. నుండి గరిష్టంగా 65 కి.మీ. వరకు చేరుకుంటుంది. మధ్య బంగాళాఖాతంలోనూ ఇదే స్థాయిలో (గంటకు 45-65 కి.మీ.) గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇది కచ్చితంగా తుపానుగా మారుతుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని, వాయుగుండంగా మారిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks