...
...
Next Story

నీళ్లపై తెలంగాణ రాజకీయాలు చేయెుద్దు.. దేవాదులకు మేం అభ్యంతరం చెప్పలేదు : చంద్రబాబు

నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణనను కోరుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు మేం ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని, కావాలంటే మరింత ముందుకు తీసుకెళ్లండని స్పష్టం చేశారు.

Published on: Jan 7, 2026, 17:35:49 IST
Advertisement

పోలవరం నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

సమీక్షలో చంద్రబాబు
సమీక్షలో చంద్రబాబు

ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని... గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్అండ్ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పారు. పునరావాసం, ఆర్అండ్ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయాలన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు చేయాలన్నారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని తనిఖీ చేస్తానని వెల్లడించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని, పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. సముద్రంలో కలిసే నీటిని ఎవరైనా వాడుకోవచ్చని, నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణనను కోరుతున్నానని చెప్పారు. రాజకీయ నాయకులు పోటీపడి మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలన్నారు.

'తెలుగు జాతి అంతా ఒక్కటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రావొద్దు. భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. ఆర్టీఎస్‌లో నీరు రాకుంటే.. జూరాల నుంచి తెచ్చి మహబూబ్‌నగర్‌కు ఇచ్చాం. దేవాదుల, కల్వకుర్తిని ప్రారంభించా. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి. ఎవరు వద్దన్నారు? గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉంది. దేవాదుల నుంచి నీరు వస్తే పోలవరానికి వస్తాయి. కిందకు వచ్చే నీళ్లకు మీరు అభ్యంతరం చెబితే ఏమైనా అర్థం ఉందా?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

అప్పుడు మంజీరాకు నీరు తీసుకెళ్లారని, స్వాగతించామని చంద్రబాబు అన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని, పూర్తి చేసుకోండని, దేవాదులకు మేం ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. నీరు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు చంద్రబాబు.

వైసీపీ కారణంగానే పోలవరం పూర్తి కావడానికి ఆరేడు సంవత్సరాలు ఆలస్యమైందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను దృష్టిలో పెట్టుకుని కొత్త డయాఫ్రం వాల్ కడుతున్నామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe