2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి - సీఎం చంద్రబాబు”
2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మాట్లాడిన ఆయన..భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని... ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది.

పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించింది. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రూ.8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్ఐపీబీ సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చేయగలిగామని సీఎంతో చెప్పారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.
ప్రజలపై భారాన్ని తగ్గించగలిగాం - సీఎం చంద్రబాబు*
విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు అన్నారు. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని గుర్తు చేశారు. రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించామని చెప్పారు.
"విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయి. విద్యుత్ రంగంతోపాటు... వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయి. దావోస్ సదస్సుకు వెళ్లాం ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగాం... విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగాం. ఏపీకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది... ఆ కిక్ కోసం అందరూ పని చేయాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలి.”అని సీఎం సూచించారు.
ఐ ల్యాండ్ టూరిజం అభివృద్ధిపై ఫోకస్…
“సూర్యలంక అత్యంత సురక్షితమైన బీచ్ ప్రాంతం. బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయండి. సూర్యలంక బీచ్ రిసార్ట్స్ బ్రాండింగ్ చేయండి. సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలి. 15 కిలోమీటర్ల మేర క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలి. కాలుష్య రహిత ప్రాంతంగా సూర్యలంక బీచ్ ఫ్రంట్ ఉండాలి. సూర్యలంకతో పాటు సూళ్లూరు పేట వద్ద ఉన్న చిన్ని చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చు. మాల్దీవ్స్ తరహాలో ఐ ల్యాండ్ టూరిజం తయారు చేసుకోవాలి. 25 వేల గదులు నిర్మించగలిగితే పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు" అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
“రాబోయే 15 ఏళ్లలో వెయ్యి కోట్ల ఆదాయం టూరిజం కార్పోరేషన్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. పాపికొండలు-పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టండి. కోనసీమ, పులికాట్, విశాఖ క్లస్టర్లు అత్యద్భుత పర్యాటక క్లస్టర్లుగా తయారవుతాయి. అనంతపురం నుంచి గండికోట వరకూ టూరిజం క్లస్టర్లలో కూడా పర్యాటకానికి అవకాశం ఉంది. తిమ్మమ్మ మర్రిమాను అతిపెద్ద మర్రిచెట్టు. గూగుల్ మ్యాపింగ్ చేయండి. ఈ చెట్టుకు 2 వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఆవకాయ్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ టూ స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్ లను ఘనంగా నిర్వహించండి” అని సీఎం సూచించారు.
కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ సమీపంలో మరింత భూమిని పరిశ్రమల కోసం సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. "ఎంప్లాయిమెంట్ పోర్టల్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావాలి. స్పేస్ సిటీ కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరం అవుతాయి. మాకవరపాలెం వద్ద ఫుడ్ పార్క్ సహా అల్యూమినియం డౌన్ స్ట్రీమ్ పరిశ్రమలు వచ్చేలా చూడండి. దీని కోసం ఇండస్ట్రియల్ పార్క్ సిద్ధం చేయండి.”అని ముఖ్యమంత్రి వివరించారు.
ఎస్ఐపీబీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఐటీ ఇన్ఫ్రా పోర్టల్ ను ప్రారంభించారు. 14వ ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హజరయ్యారు.
పెట్టుబడుల వివరాలివే…
14వ ఎస్ఐపీబీ సమావేశంలో 14 సంస్థలకు చెందిన రూ. 19,391 కోట్ల పెట్టుబడులు, 11,753 ఉద్యోగ అవకాశాలకు ఆమోదం లభించింది. ఆమోదించిన పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలివే...
• ఆర్ణ కోస్టల్ రిసార్ట్స్-బాపట్ల జిల్లా-రూ. 187.58 కోట్లు-250 ఉద్యోగాలు
• సైవెన్, యూనిఫై కన్సార్షియం-బాపట్ల జిల్లా-రూ. 183.87 కోట్లు-196 ఉద్యోగాలు
• శుభం, ఇంద్రనీర్ కన్సార్షియం-బాపట్ల జిల్లా-రూ. 64.44 కోట్లు-100 ఉద్యోగాలు
• ఇస్కాన్-సత్యసాయి జిల్లా- రూ. 425.20 కోట్లు-1035 ఉద్యోగాలు
• సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్-అనంత జిల్లా -రూ. 200.82 కోట్లు-245 ఉద్యోగాలు
• నవ ఫుడ్ సెంటర్-తిరుపతి జిల్లా- రూ. 44.42 కోట్లు-500 ఉద్యోగాలు
• వెబ్ సోల్ రెన్యూవబుల్-నాయుడుపేట-రూ. 3538 కోట్లు-1980 ఉద్యోగాలు
• టాటా పవర్-నెల్లూరు జిల్లా-రూ. 6675 కోట్లు-1000 ఉద్యోగాలు
• రామ్ కో సిమెంట్స్- నంద్యాల జిల్లా-రూ. 1500 కోట్లు-300 ఉద్యోగాలు
• షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ -కడప జిల్లా-రూ. 5571 కోట్లు-5000 ఉద్యోగాలు
• ఎథిరియల్ ఎక్స్ ప్లోరేషన్ గిల్డ్-తిరుపతి జిల్లా-రూ. 578 కోట్లు-382 ఉద్యోగాలు
• పయనీర్ క్లీన్ యాంప్స్-చిత్తూరు జిల్లా-రూ. 159 కోట్లు-600 ఉద్యోగాలు
• రాధికా వెజిటబుల్స్ ఆయిల్స్ -విజయనగరం జిల్లా-రూ. 234 కోట్లు-165 ఉద్యోగాలు
• రిలయెన్స్ కన్స్యూమర్స్-అనకాపల్లి జిల్లా- రూ. 30 కోట్లు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

