నీటి విషయంతోపాటు ఇతర అంశాల్లో తెలుగువారు కలిసే ఉండాలి : సీఎం చంద్రబాబు

మాతృ భాషను మరిచిపోతే మనల్ని మనం కోల్పోయినట్టేనని సీఎం చంద్రబాబు అన్నారు. మాతృ భాష అమ్మతో సమానం అని గుర్తు చేశారు.

Published on: Jan 5, 2026, 15:13:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మాతృభాష మన మూలాలకు సంకేతం అని, ఆంగ్లం అవసరమే కానీ.. మాతృ భాషను మరిచిపోతే మనల్ని మనం కోల్పోయినట్టేనని అన్నారు.

సీఎం చంద్రబాబు (PTI)
సీఎం చంద్రబాబు (PTI)

'మాతృభాష అమ్మతో సమానం. మాతృ భాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఏమైనా చేయగలరు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్‌కు అభినందనలు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన అమ్మభాష పండుగ ఇది. తెలుగు వారి ఆత్మగౌరవం చాటిన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేరు ఈ వేదికకు పెట్టడం మంచి విషయం. దేశంలో అనేక భాషలు ఉన్నా ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉంది. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనం చాటేందుకు ఉపయోగపడతాయి.' అని చంద్రబాబు అన్నారు.

తెలుగు రచనలు అంటే నన్నయ్య మహాభారతం, అష్టదిగ్గజాలు అని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గురజాడ వంటి అనేకమంది గొప్ప రచయితలు.. పద్య రచయితల రచనలను మనం ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. అన్నమయ్య, రామదాసు, మెుల్ల, వెంగమాంబ వంటివారు భక్తి మార్గంలో తెలుగుకు వన్నె తెచ్చారని కీర్తించారు.

'గ్రాంథిక భాష నుంచి వచన భాషగా మార్చిన వారిని మరిచిపోలేం. నేను తెలుగువాడిని నాది తెలుగు భాష అని చాటిన వ్యక్తి ఎన్టీఆర్. భాషాప్రయుక్త రాష్ట్రాలు రావాలని పోరాడిన వ్యక్తి మహనీయుడు పొట్టి శ్రీరాములును మరవలేం. రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలని పోరాడిన బూర్గుల రామకృష్ణారావు త్యాగం మరవలేం. వారసులుగా భాషను కాపాడుకోవడం మన బాధ్యత.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నవారు, ప్రతిభ చూపినవారికి పూర్ణకుంభ వంటి అవార్డులు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. 1949లో హైదరాబాద్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్‌గా ఎదిగిందన్నారు. 2017లో ఆంధ్ర సారస్వత పరిషత్‌కు మళ్లీ ఊపిరిపోశారన్నారు. మాతృభాష మన మూలాలకు సంకేతం అని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీతో భాష కనుమరుగు అవుతుందని అన్నారని, కానీ టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చన్నారు.

'కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అడ్డుపడలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరం. నీటి విషయంతోపాటు ఇతర అంశాల్లో తెలుగువారు కలిసే ఉండాలి. గంగా-కావేరి కలవాలి.. దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలి. అదే నా కోరిక. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కావాలి. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే అడ్డుచెప్పలేదు.' అని చంద్రబాబు మాట్లాడారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More