...
...
Next Story

AP Gold Mining Project : రాయలసీమలో 'పసిడి' పంట..! అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ సిద్ధం, విశేషాలివే

AP Gold Mining Project : కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రూ.405 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా ఏటా 2 టన్నుల బంగారం ఉత్పత్తి కానుంది.

Published on: Jun 24, 2026 05:12 AM IST
Advertisement

AP Gold Mining Project : బంగారు నిక్షేపాల గని అనగానే ఇప్పటివరకు దేశంలో కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇకపై ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన 'జొన్నగిరి' పేరు దేశవ్యాప్తంగా మారుమోగనుంది. ఒకప్పుడు కరవు కాటకాలకు నిలయంగా మారిన కర్నూలు జిల్లా ఇప్పుడు దేశంలోనే పసిడి ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా అవతరించబోతోంది.

గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్
గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్

ప్రైవేట్ రంగంలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఈ ప్లాంట్ కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరిలో ప్రారంభానికి సర్వసిద్ధమైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు.

విశేషాలు…

  • ఈ మెగా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు 1,500 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం మొదటి దశ కింద 600 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు వీలుగా అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
  • ప్రాజెక్టు విస్తరణలో భాగంగా మిగిలిన ల్యాండ్‌ బ్యాంక్‌లో రెండో ప్లాంట్ నిర్మాణానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇదే పర్యటనలో శంకుస్థాపన చేయనున్నారు.
  • జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా రూ.405 కోట్ల భారీ పెట్టుబడితో ఈ బంగారు నిక్షేపాలు వెలికితీసే కర్మాగారాన్ని నెలకొల్పాయి.
  • ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నీటి కోసం హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి 18 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైపులైన్‌ను నిర్మించి 0.021 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఈ మైనింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి.
  • జొన్నగిరి ప్లాంట్ ద్వారా బంగారు ఉత్పత్తిని దశల వారీగా పెంచేందుకు నిర్వాహక సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
  • తొలి దశలో భాగంగా మొదటి సంవత్సరంలో 400 కిలోల పసిడిని ఉత్పత్తి చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి 900 కిలోల బంగారాన్ని వెలికితీస్తారు.
  • ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత, ఏటా ఏకంగా 2 టన్నుల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్ర ఖజానాకు భారీగా రాయల్టీ ఆదాయం :

గోల్డ్ మైనింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. ఉదయం 11:30 గంటలకు కర్నూలు జిల్లా జొన్నగిరిలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11:45 గంటలకు ప్లాంట్ మొదటి యూనిట్‌ను ప్రారంభించి, అధికారికంగా బంగారం వెలికితీత పనులను ప్రారంభిస్తారు. అనంతరం జియో మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:20 గంటలకు జొన్నగిరి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe