ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం - రూ.100 కోట్ల విరాళం
అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. యూఏఈ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు… శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో సమావేశమయ్యారు. గ్రంథాలయం నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించటంపై ధన్యవాదాలు తెలిపారు.
దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని నిర్మించనుంది. ఏపీలో పెట్టుబడి అవకాశాలు వివరించేందుకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుతో ఆ దేశంలోని శోభా రియాల్టి చైర్మన్ రవి మీనన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లైబ్రరీ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించారు.

సీఎం చంద్రబాబు హర్షం…
శోభా రియాల్టి సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయం నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించటంపై ధన్యవాదాలు తెలియచేశారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని సీఎం ఆయనకు వివరించారు. రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టీ సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు.
ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు కోరారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో నగరాలు నిర్మితం అవుతున్నాయని వాటితో సమానంగా మౌలిక సదుపాయాలతో అమరావతిని నిర్మిస్తున్నట్టు సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు శోభా గ్రూప్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు.
అపారమైన అవకాశాలున్నాయి - సీఎం చంద్రబాబు
అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతోందని చంద్రబాబు చెప్పారు. ఇక తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయని... మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.
రాష్ట్రంలో రియాల్టి రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో అమరావతి, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా బిజినెస్ ఐటీ పార్కులు, మాల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లతో పాటు ఉన్నతశ్రేణి వర్గాలకు హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నిర్మితం అవుతున్న పారిశ్రామిక కారిడార్లు, పోర్టులకు అనుసంధానంగా ఇండస్ట్రియల్ టౌన్ షిప్, హౌసింగ్ ప్రాజెక్టులకు అవకాశం ఉందని శోభా రియాల్టీ చైర్మన్ రవి పీఎన్సీ మీనన్ కు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా శోభా గ్రూప్ సంస్థ చేస్తున్న ఛారిటీని సీఎం అభినందించారు. తమ ఆదాయంలో 50 శాతాన్ని ఛారిటీగా ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ తాము ఏపీలో పీ4 విధానాన్ని అవలంభిస్తూ అమలు చేస్తున్న జీరో పావర్టీ మిషన్ అంశాలను వివరించారు.
తమ సంస్థ దుబాయ్ తో పాటు ఓమన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనై దేశాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోందని శోభా గ్రూప్ చైర్మన్ రవి మీనన్ ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ లోని 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో శోభా రియాల్టీ ప్రాజెక్టులు చేస్తోందని.. ప్రత్యేకించి బెంగుళూరు, గుర్గాంవ్, చెన్నై, కేరళలోని హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టామని సీఎంకు తెలిపారు. వచ్చే నెల నవంబర్14, 15వ తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని...ఆ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

