AP Crop Insurance 2026 : పంటల బీమాకు మరికొన్ని గంటలే గడువు - కావాల్సిన పత్రాలు, దరఖాస్తు ప్రాసెస్ ఇలా
AP Crop Insurance 2026 : ఖరీఫ్ పంటల బీమా నమోదుకు జూలై 31వ తేదీనే ఆఖరి గడువని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు చివరి నిమిషం వరకు ఆగకుండా వెంటనే తమ పంటలకు బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
AP Crop Insurance 2026 :c ఆంధ్రప్రదేశ్‌లోని ఖరీఫ్ సాగుదారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మరోసారి ముఖ్యమైన సూచన చేసింది. ఈ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా (Crop Insurance) నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. జూలై 31వ తేదీలోగా ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు పలు వివరాలను వెల్లడించారు.

అనూహ్యంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు వంటి విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం వాటిల్లితే రైతు కుటుంబానికి కొండంత అండగా నిలిచేది కేవలం పంటల బీమా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఖరీఫ్ పంటలకు బీమా నమోదు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుందని, అందుకే ఒక్క రైతు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోవద్దని కోరారు. చాలామంది రైతులు చివరి రోజు వరకు వేచి చూసే అలవాటు ఉంచుకుంటారని, కానీ ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్యలు లేదా రద్దీ వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
గడువు దాటిన తర్వాత నమోదు చేసుకునేందుకు ఎలాంటి అవకాశం ఉండదని… అందుకే ప్రతి ఒక్కరూ ముందస్తుగానే అప్రమత్తంగా వ్యవహరించి ఈ ప్రక్రియను ముగించాలని సూచించారు. రైతు ఏడాది పొడవునా రక్తాన్ని చెమటగా మార్చి పడే శ్రమకు…. పెట్టుబడికి రక్షణ గోడలా నిలిచే ఏకైక మార్గం పంటల బీమా మాత్రమేనని మంత్రి పునరుద్ఘాటించారు.
నమోదు ఎంతో సులభం
రైతన్నలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బీమా నమోదు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, సులభతరంగా మార్చిందని మంత్రి వివరించారు. స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న రైతులు నేరుగా 'PMFBY Crop Insurance Farmer App' ద్వారా స్వయంగా తమ పంటలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఒకవేళ యాప్ వినియోగం తెలియకపోతే దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), సంబంధిత బ్యాంకు శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) లేదా గ్రామ, మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సహాయం పొందవచ్చని చెప్పారు.
కావాల్సిన పత్రాలు ఇవే!
బీమా నమోదుకు వెళ్లే సమయంలో రైతులు తమ వద్ద భూమి వివరాలు (పహాణీ/పాస్ బుక్), ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పంట సాగుకు సంబంధించిన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇచ్చే రసీదు (Receipt) లేదా ధ్రువీకరణ ప్రతిని జాగ్రత్తగా దాచుకోవాలని కోరారు.
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతునూ పంటల బీమా పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి రైతులను చైతన్యపరచాలని స్పష్టం చేశారు. "రైతు పడే ఏడాది శ్రమను కాపాడేది పంటల బీమా. కాబట్టి జూలై 31 ముగిసేలోగా నమోదు చేసుకుని తమ పంటలకు భద్రత కల్పించుకోవాలి" అని మంత్రి మరోసారి విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

