AP Municipal Elections 2026 : త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు - ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని జీవో జారీ చేస్తూ అధికారులను ఆదేశించింది.
AP Municipal Elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల ముందస్తు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.

ముగియనున్న పదవీకాలం…
రాష్ట్రంలో ఇప్పటికే 87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు పూర్తయింది. మరో 13 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం రాబోయే నవంబర్ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పాలకవర్గాల గడువు ముగిసిన చోట, త్వరలో ముగియనున్న చోట ఎలాంటి ఆలస్యం లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన, సీట్ల రిజర్వేషన్ల నోటిఫికేషన్లు తదితర ముందస్తు చర్యలన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
పాలకవర్గాలు లేకపోవడంతో పట్టణాల్లో స్థానిక పరిపాలనతో పాటు అభివృద్ధి పనులు మందగించకుండా చూసేందుకు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తయిన వెంటనే ఎన్నికల సంఘం తుది షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేబినెట్ తాజాగానే నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ…. వాటిని చట్టబద్ధంగా అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని (రూరల్) స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో (అర్బన్) 33.13 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో…. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.
మరోవైపు 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు మంజూరు కావాలంటే పాలకవర్గం తప్పనిసరిగా కొలువుదీరి ఉండాలి. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగానే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

