రంజాన్ మాసం... ఆఫీస్ నుంచి ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Feb 11, 2026, 16:20:31 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఒక గంట ముందుగా పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రంజాన్ కాలం ఫిబ్రవరి 17వ తేదీన మెుదలవుతుందని చెబుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ వెసులుబాటు ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న అందరు ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇందులో ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉపవాస మాసంలో ఉద్యోగులు మతపరమైన ఆచారాలను పాటించడంలో సహాయపడటానికి ఈ వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

రంజాన్ మాసంలో గంట ముందుగానే వెళ్లేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ముస్లిం ఉద్యోగులు ప్రార్థనలకు హాజరు కావడానికి పనివేళలు అధికారికంగా ముగిసే గంట ముందు బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

మైనారిటీ సమాజం మతపరమైన భావాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి ఫరూఖ్ కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలనా క్రమశిక్షణను పాటిస్తూనే.. సమాజంలోని అన్ని వర్గాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఉద్యోగులు స్వాగతించారు. పవిత్ర మాసంలో అధికారిక విధులను మతపరమైన ఆచారాలతో సమతుల్యం చేసుకోవడానికి వీలు కల్పించే సహాయక చర్యగా దీనిని భావిస్తారు.

త్వరలోనే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ముస్లిం ఉద్యోగులు కార్యాలయాల నుంచి నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లవచ్చు. అంటే సాయంత్రం 4 గంటలకే విధుల నుండి ఇంటికి వెళ్ళవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ ఉపవాసం సందర్భంగా ఉద్యోగులకు సాయంత్రం వేళల్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ విందు కోసం ఉపవాసం ఉన్నవారు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటుతో ముస్లింలకు చాలావరకు ఉపశమనం దొరుకుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More