మొంథా తుఫాన్ ఎఫెక్ట్ : ఏపీకి రూ.5,244 కోట్లు నష్టం - కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక

మొంథా తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నివేదికను పంపింది. రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలు పంపాలని కోరింది.

Published on: Nov 1, 2025, 05:15:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మొంథా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక నివేదికను పంపారు.

కేంద్రానికి ఏపీ సర్కార్ ప్రాథమిక నివేదిక
కేంద్రానికి ఏపీ సర్కార్ ప్రాథమిక నివేదిక

17 శాఖలు, రూ.5,244 కోట్లు నష్టం….

ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం 17 శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం ప్రాథమిక అంచనాల ప్రకారమే నివేదిక సమర్పించామని, పూర్తి స్థాయిలో వివరాలు వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రానికి తక్షణ ఆర్ధిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ప్రాథమిక నివేదికలో అంశాలవారీగా ఏయే శాఖలు, ఏయే రంగాల వారీగా ఎంతమేర నష్టం వాటిల్లిందన్న సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలను పేర్కొంది. ఆర్టీజీఎస్ నుంచి తుఫాన్ ప్రభావాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుందో వివరించింది. 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమించినట్టు తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువుగా ఉందని నివేదికలో వెల్లడించింది.

రాష్ట్రంలోని 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడింది. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది. తుఫాన్ వల్ల సంభవించిన నష్టాన్ని శాస్త్రీయంగా మదింపు చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు తుఫాన్ తీవ్రతను అద్దం పట్టేలా ఫోటోలను లేఖతో జతపరిచి... తుఫాన్ నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపాల్సిందిగా కోరింది.

వీటిల్లోనే అత్యధికం….

అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం... అత్యధికంగా రహదారులు, వ్యవసాయం-అనుబంధ రంగాల్లో నష్టం సంభవించినట్టు పేర్కొన్నారు. తుఫాన్ వల్ల ముగ్గురు మరణించినట్టు వెల్లడించారు. 4,794 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రహదారులు, 311 కల్వర్టులు-బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. ఈ నష్టం రూ.2,774 కోట్ల మేర ఉందని వివరించారు. 18 జిల్లాల్లోని 862 కి.మీ. మేర పంచాయతీ రాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఈ శాఖకు రూ.454 కోట్ల నష్టం జరిగింది. 48 పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతులు విధ్వంసమయ్యాయి. వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు వ్యయం కానుందని నివేదికలో చెప్పారు.

వ్యవసాయరంగంలో ఇలా…

వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని... దీంతో రూ.829 కోట్ల వరకు రైతులు నష్టపోయినట్టు నివేదిక ప్రస్తావించింది. మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం చూపించింది. 12,215 హెక్టార్లలోని రూ.40 కోట్ల విలువైన ఉద్యానపంటలు దెబ్బతినగా 23,979 మంది ఉద్యాన రైతులకు నష్టం జరిగింది. ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. మరోవైపు 2,261 పశు సంపదను నష్టపోయారు.

రాష్ట్రంలోని 2,817 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా, 26,575 డీటీఆర్‌లు ధ్వంసమయ్యాయి. 429 కి.మీ. మేర విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీని వల్ల విద్యుత్ శాఖకు రూ.19 కోట్ల వరకు నష్టం జరిగింది. ఇక, రూ.234 కోట్ల మేర నష్టం నీటిపారుదల శాఖకు కలిగింది. అలాగే, 23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసమైనట్టు ప్రాథమిక నివేదికలో గుర్తించారు.

అంగన్వాడీలు, పాఠశాలలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, చేనేత మగ్గాలు అన్నీ కలిపి రూ.122 కోట్ల నష్టం వాటిల్లింది. మరోవైపు, 1,464 చోట్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయగా 1,36,907 మందికి పునరావాసం కల్పించారు. సహాయక చర్యల కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ.32 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More