...
...
Next Story

ప్రభాస్ కల్కి సినిమాలోని ఓల్డ్ టెంపుల్ గుర్తుందా? దానిని పునర్నిర్మించే పనిలో దేవాదాయ శాఖ!

ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని ఓల్డ్ టెంపుల్ గుర్తుందా? అది నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని పురాతన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం. దీనిని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Published on: Feb 15, 2026, 22:48:48 IST
Advertisement

నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని పురాతన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆలోచిస్తున్నట్టుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. మహా శివరాత్రి రోజున ఆత్మకూరు నియోజకవర్గాన్ని సందర్శించిన మంత్రి రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడానికి వివరణాత్మక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు.

నాగేశ్వర స్వామి ఆలయం (Facebook)
నాగేశ్వర స్వామి ఆలయం (Facebook)

పెరుమాళ్లపాడులోని ఎంపీపీ పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామస్తులను ఉద్దేశించి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. స్థానికుల సమ్మతితో పెన్నా నది దగ్గర కొత్త ఆలయాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం అధికారులు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తిస్తారన్నారు. ఆలయ చరిత్రను గుర్తుచేసుకుంటూ, 2021–22లో ఇసుక దిబ్బల కింద కూరుకుపోయిన పురాతన నిర్మాణాన్ని స్థానిక యువకులు గుర్తించారని మంత్రి అన్నారు. ఎన్నికల హామీ మేరకు అధికారులు ఇసుకను తొలగించి ఆ స్థలం నుండి గణపతి, శివలింగం, నాగ విగ్రహాలను వెలికితీశారన్నారు.

దీని ప్రాచీనతను పరిగణనలోకి తీసుకుని, పునర్నిర్మాణం ఆగమ శాస్త్ర సూత్రాలను అనుసరిస్తుందని నిర్ధారించుకోవడానికి ఎండోమెంట్స్, పురావస్తు శాఖతో చర్చలు జరిగాయని చెప్పారు మంత్రి. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేస్తామని అన్నారు. పూర్వీకులు ఇచ్చిన దేవాలయాలను సంరక్షించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా దాని చారిత్రక ప్రాముఖ్యతకు తగిన విధంగా ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అన్నారు.

పెరుమాళ్లపాడులో అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ రూ.20 లక్షలు, రూ.15 లక్షల వ్యయంతో దశలవారీగా సిమెంట్ రోడ్లు వేశామన్నారు మంత్రి ఆనం. 22 లక్షల వ్యయంతో గ్రామ ఆరోగ్య క్లినిక్ నిర్మించామన్నారు. '10 లక్షల వ్యయంతో పాఠశాల కాంపౌండ్ వాల్ పనులు చేపట్టాం. రూ.4 కోట్ల వ్యయంతో మాముదురు-గొల్లపల్లి మీదుగా కొత్త రోడ్డు మంజూరు చేశాం. రూ.3 కోట్ల విలువైన సబ్‌స్టేషన్ కూడా ఆమోదించాం. త్వరలో టెండర్లు పిలవనున్నాం. పెరుమాళ్లపాడు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.' అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks