...
...
Next Story

లేపాక్షి ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ సిస్టమ్.. స్కాన్ చేస్తే పూర్తి సమాచారం

రాష్ట్ర హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించింది. దీంతో హస్తకళలకు సంబంధించిన పూర్తి సమాచారం అందులో దొరుకుతుంది.

Published on: Aug 6, 2026, 14:36:53 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రాచీన హస్తకళలు, సాంప్రదాయ కళారూపాలకు ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ(లేపాక్షి) ఒక వినూత్న అడుగు వేసింది. రాష్ట్రంలోని విశిష్ట కళాఖండాల సమగ్ర వివరాలను, వాటిని రూపొందించిన హస్తకళాకారుల సమాచారాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు గాను నూతనంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

రాష్ట్ర హస్తకళలపై క్యూఆర్ కోడ్
రాష్ట్ర హస్తకళలపై క్యూఆర్ కోడ్

ఈ నూతన సాంకేతిక విధానం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన నుండి రూపుదిద్దుకుందని ఎపీ హస్తకళల అభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

వినియోగదారులు లేదా పర్యాటకులు లేపాక్షి షోరూమ్‌లలో కళాఖండాలపై ఉండే క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు డిజిటల్ రూపంలో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఆ వస్తువు ప్రాముఖ్యత, దాని తయారీలో ఉపయోగించిన ముడిపదార్థాలు ఉంటాయి. వస్తువును రూపొందించడానికి పట్టిన సమయం, దాని విశిష్టత తెలుస్తుంది.

ఆ కళాఖండాన్ని ప్రాణం పోసి తయారుచేసిన హస్తకళాకారుడి పేరు, వారి నివాస ప్రాంతం, అనుభవం కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ విధానంలో ప్రముఖ కళాకారుడు బోనుమద్ది మురళి అత్యంత నైపుణ్యంతో చెక్కిన బొబ్బిలి వీణ వివరాలు. ప్రముఖ హస్తకళాకారుడు సి. సుబ్రమణ్యం రూపుదిద్దిన మహాభారతం, కృష్ణలీలలు, సంపూర్ణ రామాయణం వంటి పౌరాణిక ఘట్టాల ఆధారిత కలంకారీ చిత్రాల సమాచారం ఉంటుంది.

ఈ క్యూఆర్ కోడ్ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో నమ్మకం పెరగడమే కాకుండా పలు కీలక ప్రయోజనాలు కలగనున్నాయి. మార్కెట్‌లో లభించే నకిలీ కళాఖండాల నుండి వినియోగదారులకు రక్షణ లభిస్తుంది. లేపాక్షి ద్వారా విక్రయించే ఉత్పత్తులు అసలైన చేతివృత్తుల వారివేనని ధృవీకరించబడుతుంది. తెరవెనుక ఉండి అద్భుతమైన కళాఖండాలను సృష్టించే గ్రామీణ చేతివృత్తుల కళాకారుల శ్రమకు తగిన గుర్తింపు, ఆదరణ లభిస్తాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks