ఆరు వారాల్లో ఏపీ స్థానిక ఎన్నికలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆరు వారాల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మెుదలుపెట్టాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

Published on: Oct 1, 2026, 11:48:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల ప్రక్రియను రాబోయే ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

స్థానిక పోరుతో ముడిపడి ఉన్న పలు కీలక వ్యాజ్యాలు, పిటిషన్లపై గతంలోనే సుదీర్ఘ విచారణ పూర్తి చేసిన హైకోర్టు, తాజాగా తన తీర్పును వెలువరించింది. ఈ విచారణలో భాగంగా వెనకబడిన తరగతులకు(BC) కేటాయించిన రిజర్వేషన్ల జీవోలపై న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 105, 1065లను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం గరిష్ఠ పరిమితిని దాటడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సమకాలీన బీసీ జనాభా డేటా ఆధారంగానే 34 శాతం కోటాను ఖరారు చేశామని ప్రభుత్వం కోర్టుకు వివరించినప్పటికీ, ఆ జీవోలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

స్థానిక పోరును అడ్డుకునేలా లేదా ఆలస్యం చేసేలా దాఖలైన పలు అనుబంధ పిటిషన్లను కూడా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

సమగ్ర బీసీ కుల గణన, విస్తృత సర్వేలు పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్లాలన్న అభ్యర్థనలను సైతం న్యాయస్థానం ఆమోదించలేదు. గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడం, వార్డుల డిలిమిటేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.

హైకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, మున్సిపల్ పోరుకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కోర్టు ఆదేశించిన ప్రకారం 6 వారాల్లోపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున, రాష్ట్ర ఎన్నికల సంఘం 50 శాతం పరిమితికి లోబడి స్థానిక సంస్థల వారీగా స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల రీ-నోటిఫికేషన్‌పై కసరత్తు ప్రారంభించనుంది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాల కొత్త రిజర్వేషన్ల జాబితాను రూపొందించిన తర్వాత ఎస్‌ఈసీ అధికారికంగా స్థానిక పోరు నోటిఫికేషన్, పోలింగ్ తేదీల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. దీంతో ఏపీలోని గ్రామాల్లో, పట్టణాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక సమరానికి సిద్ధం కావాలని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే పనులు మెుదలుపెట్టాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More