...
...
Next Story

అర్నబ్‌ తుపాను కోసం 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది.. ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు

అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తమైంది. ఇందులో భాగంగా 6 వేల మంది విద్యుత్ సిబ్బందిని రంగంలోకి దించింది. ఇతర శాఖలతో సమన్వయానికి ప్రత్యేక గ్రూప్‌ ఏర్పాటు చేసింది.

Published on: Oct 27, 2026, 22:20:41 IST
Advertisement

అర్నబ్‌ తుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సుమారు 6 వేల మంది అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుపాను సన్నద్ధత, విద్యుత్‌ సరఫరా పరిస్థితి, అత్యవసర సేవలపై సమీక్షించారు.

అర్నబ్ తుపాను ఎఫెక్ట్ (Facebook)
అర్నబ్ తుపాను ఎఫెక్ట్ (Facebook)

తుపాను ప్రభావం లేని ప్రాంతాల్లోని అవసరమైన సిబ్బంది సెలవులను రద్దు చేసి, ప్రభావిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో డైరెక్టర్లు స్వయంగా పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.

తెగిపడిన విద్యుత్‌ తీగలు, కూలిన స్తంభాలు, దెబ్బతిన్న కండక్టర్ల మరమ్మతులతోపాటు సమస్యలు తలెత్తిన 132 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. తుపాను తీవ్రత దృష్ట్యా అవసరమైన విద్యుత్‌ సామగ్రిని డివిజనల్‌ కార్యాలయాలు, మండల కేంద్రాల్లో ముందుగానే సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు.

విద్యుత్‌ సరఫరా అంతరాయాలు, తెగిపడిన తీగలు, కూలిన స్తంభాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే స్పందించేందుకు 1912 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేసినట్లు గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ఒకేసారి 30 వేల కాల్స్‌ స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే ప్రజలు 1912కు సమాచారం అందించాలని సూచించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తెగిపడిన విద్యుత్‌ తీగలు, కండక్టర్లను చేతితో తాకవద్దని హెచ్చరించారు. రహదారులపై పడిన విద్యుత్‌ పరికరాల దగ్గరకు వెళ్లడం కూడా ప్రమాదకరమని తెలిపారు. అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే విద్యుత్‌ శాఖ సిబ్బందికి లేదా 1912 కాల్‌సెంటర్‌కు సమాచారం అందించాలని కోరారు.

ప్రాణనష్టం జరగకుండా, సాధ్యమైనంత మేర ఆస్తి నష్టాన్ని నివారించేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. తుపాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks