...
...
Next Story

ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు అలర్ట్ - ఈ తేదీలోపు లెక్కలు చెప్పాల్సిందే, లేకపోతే పదవి ఊడినట్టే!

AP MPTC ZPTC election expenditure : ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా డిసెంబర్ 21 లోగా ఎన్నికల వ్యయ వివరాలను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలి. లెక్కలు చెప్పకపోతే మూడేళ్ల అనర్హతతో పాటు పదవి కోల్పోతారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Published on: Nov 25, 2026, 05:12:42 IST
Advertisement

AP MPTC ZPTC election expenditure : రాష్ట్రంలో ఇటీవల ముగిసిన రెండవ సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘంకీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో గెలిచిన వారైనా, ఓడిపోయిన వారైనా సరే.. పోటీలో నిలిచిన ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన తుది వివరాలను 2026 డిసెంబర్ 21వ తేదీలోగా తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో ఆయన ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

లెక్కలు అప్పగించాల్సిందే….

ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు
ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తర్వాత 2026 నవంబర్ 7వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 230-B నిబంధనలను అనుసరించి….. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థి ఫలితాలు వెలువడిన నాటి నుంచి 45 రోజుల్లోగా తమ ఎన్నికల వ్యయ వివరాలను అధికారులకు అందజేయాలి. అలాగే ఎన్నికల నిర్వహణ నియమావళి-2006లోని రూల్ 100(2) ప్రకారం…. అభ్యర్థులు తమ ఖర్చుల తుది వివరాలను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ద్వారా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు ప్రకారం 2026 డిసెంబర్ 21వ తేదీనే చివరి రోజుగా ఎన్నికల సంఘం ఖరారు చేసింది.

నిర్లక్ష్యం చేస్తే మూడేళ్ల అనర్హత వేటు..

ఎన్నికల వ్యయ వివరాల సమర్పణ విషయంలో అభ్యర్థులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా హెచ్చరించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 19-B ప్రకారం, నిర్ణీత గడువులోగా ఖర్చుల లెక్కలు చూపని అభ్యర్థులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేస్తుంది. దీనివల్ల సదరు అభ్యర్థులు రాబోయే మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హతను కోల్పోతారు. ఒకవేళ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి గనుక గడువులోగా వ్యయ వివరాలు సమర్పించకపోతే….. చట్ట ప్రకారం తన పదవిని కూడా కోల్పోవాల్సి వస్తుందని కమిషనర్ తేల్చిచెప్పారు. గెలిచినా, ఓడినా పోటీ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుందని వివరించారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks