AP Class 10 Exam Fee Schedule : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారం అందించింది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపుల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్దేశిత వ్యవధిలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానంద్ రెడ్డి (శ్రీనివాసులురెడ్డి) ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలు

విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము (లేట్ ఫీజు) లేకుండా ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత కూడా విద్యార్థులు ఫైన్‌తో ఫీజు చెల్లించేందుకు వేర్వేరు గడువులను నిర్ణయించారు.
- రూ. 50 అపరాధ రుసుముతో ఈ నెల 26వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు
- రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబరు 3వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు
- రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు చెల్లించవచ్చు.
పరీక్షలు రాసే విద్యార్థుల విభాగాలను బట్టి రుసుము వివరాలను పరీక్షల విభాగం సమగ్రంగా వెల్లడించింది.
- రెగ్యులర్ విద్యార్థులు (మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు): రూ. 125
- సప్లిమెంటరీ/కంపార్ట్మెంటల్ (మూడు సబ్జెక్టుల వరకు రాసేవారు): రూ. 110
- వృత్తివిద్య (వొకేషనల్) అభ్యర్థులు సాధారణ ఫీజుకు అదనంగా రూ. 60 చెల్లించాలి.
- నిర్ణీత వయసు నిబంధనల నుంచి సడలింపు కోరే విద్యార్థులు అదనంగా రూ. 300 సడలింపు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియను సమయానికి పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందే ఫీజు చెల్లించుకోవడం మంచిదని స్పష్టం చేశారు. పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యేలోపు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.