...
...
Next Story

AP TET 2025 : నేటి నుంచి ఏపీ ‘టెట్‌’ పరీక్షలు ప్రారంభం - అభ్యర్థులకు కీలక సూచనలు

ఇవాళ్టి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి.ఈ నెల 21వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Published on: Dec 10, 2025, 06:57:56 IST
Advertisement

నేటి నుంచి ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌ డిసెంబర్‌–2025) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 21వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి.

ప్రతి రోజూ 2 సెషన్లు…

ఏపీ టెట్ పరీక్షలు 2025
ఏపీ టెట్ పరీక్షలు 2025

రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటలు ఒక సెషన్ ఉండగా.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.

ఈసారి జరిగే టెట్ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి టెట్‌కు 32 వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థులకు కీలక సూచనలు…

ఏపీ టెట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉంటే నామినల్‌ రోల్స్‌లో సరిదిద్దుకునేందుకు ఆయా పరీక్ష సెంటర్ల వద్ద సరైన ధ్రువీకరణపత్రాలు చూపించి మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ ఐడెంట్‌టి కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. మొబైల్‌ ఫోన్, స్మార్ట్‌ వాచ్, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పరీక్ష కేంద్రానికి కనీసం 60 నిమిషాల ముందే చేరుకోవాలి. రిపోర్టింగ్ టైం దాటి వచ్చిన అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఉండదు కాబట్టి త్వరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలిపరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం సీరియల్ నెంబర్ చెక్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది.

జనవరి 2వ తేదీన ఏపీ టెట్ ఎగ్జామ్స్ ప్రాథమిక కీలు విడుదలవుతాయి.జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 13వ తేదీన ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు.

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. కాబట్టి టెట్ లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందులో సాధించే స్కోర్… డీఎస్సీలో వెయిటేజీగా తీసుకుంటారు.

మరోవైపు ఏపీ టెట్ కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవటంతో పాటు మాక్ టెస్టులు కూడా రాసుకోవచ్చు. ఇతర ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks