...
...
Next Story

APSRTC : పంచారామాలు, శబరిమల, శ్రీశైలం క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. ఇందులో 20 శాతం రాయితీ!

APSRTC : కార్తీకమాసం పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్సీసులను నడుపుతోంది. మరోవైపు రాయితీలు కూడా ప్రకటిస్తోంది.

Published on: Nov 22, 2026, 14:23:27 IST
Advertisement

పవిత్రమైన కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం డిపో ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పంచారామాలు, శబరిమల, శ్రీశైలం క్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించినట్లు విజయనగరం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

పంచారామాలకు ప్యాకేజీ

ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు (X)
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు (X)

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలను ఒకే యాత్రలో దర్శించుకునేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవంబర్ 15, 22, 29, డిసెంబర్ 5 తేదీలలో ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు విజయనగరం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి, సోమవారం ఐదు క్షేత్రాల దర్శనం పూర్తి చేసుకుని, తిరిగి మంగళవారం ఉదయం 6 గంటలకు విజయనగరం చేరుకుంటాయి. సూపర్ లగ్జరీ బస్సులో రూ. 2,000, అల్ట్రా డీలక్స్ బస్సులో రూ. 1,950గా నిర్ణయించారు.

శబరిమలకు ప్రత్యేక బస్సులు

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాముల కోసం 35 సీట్ల పుష్‌బ్యాక్, 38 సీట్ల సెమీ పుష్‌బ్యాక్ అల్ట్రా డీలక్స్ బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. భక్తులు తమకు అనుకూలమైన తేదీల్లో బస్సులను బుక్ చేసుకునేందుకు ముందస్తుగా 7382924103 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తుల కోసం కార్తీక మాసం మొత్తం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయనగరం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరే ఈ బస్సు, మూడో రోజు ఉదయం 10 గంటలకు తిరిగి చేరుకుంటుంది. సూపర్ లగ్జరీ బస్సులో ఒకవైపు ప్రయాణానికి టికెట్ ధర రూ. 1,340 గా నిర్ణయించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డిపో నుంచి వివిధ ప్రధాన నగరాలకు నడిచే ఏసీ బస్సు సర్వీసుల్లో అప్ అండ్ డౌన్(రానుపోను) టికెట్ బుకింగ్‌లపై 10 నుంచి 20 శాతం వరకు ప్రత్యేక రాయితీని కల్పిస్తున్నట్లు అమలాపురం డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

ప్రయాణికులు తమ ప్రయాణ టికెట్లను రానుపోను ఒకేసారి బుక్ చేసుకుంటే ఈ రాయితీ వర్తిస్తుంది. అమలాపురం డిపో నుంచి హైదరాబాద్, తిరుపతి నగరాలకు నడుస్తున్న అమరావతి, నైట్ రైడర్ ఏసీ బస్సు సర్వీసుల టికెట్ ధరలపై ఏకంగా 20 శాతం తగ్గింపు లభిస్తుంది. అమలాపురం నుంచి విశాఖపట్నం, విజయవాడకు రాకపోకలు సాగించే ఇంద్ర ఏసీ బస్సు సర్వీసుల్లో అప్ అండ్ డౌన్ టికెట్లపై 10 శాతం రాయితీని అందిస్తున్నారు.

ఈ ప్రత్యేక రాయితీ సదుపాయం నవంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల నుంచి లభించే స్పందన, ఆదరణను బట్టి ఈ రాయితీ ఆఫర్‌ను డిసెంబర్ నెలలో కూడా పొడిగించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డిపో మేనేజర్ పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీల బారిన పడకుండా, సురక్షితమైన ఆర్టీసీ ఏసీ బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks