Tirumala Private Vehicles : తిరుమలకు రోజుకు 15,000 ప్రైవేటు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తున్నారా?
Tirumala Private Vehicles : తిరుమలకు ప్రైవేటు వాహనాలు అనుమతి లేదని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.
తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారన్న విషయం టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.

ఇది పూర్తిగా అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని టీటీడీ తీసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారం అధికారిక టీటీడీ ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదు. టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీ నుండి తిరుమలలో ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి 7గంటల నుండి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
సేనాధిపతి ఉత్సవం
శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీవిష్వక్సేనులవారిని ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.
మేదినిపూజ
నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.
అంకురార్పణ
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.
అక్షతారోపణ
ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


